సమస్యల నిలయం
మహిమాన్విత ఆలయం..
సాక్షి,బళ్లారి: నిత్యం వేలాది మంది భక్తులతో కిటికిటలాడే మహిమాన్విత పుణ్యక్షేత్రంలో మౌలిక సదుపాయాలతో పాటు స్వచ్ఛత కరువు కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కొంగుబంగారంగా పిలవబడే ఈ క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మాఘ మాసంలో ప్రతి ఏటా భక్తుల సందడి పెరిగే ఈ ఆలయం విశిష్టత, చరిత్రను పరిశీలిస్తే...
యోగమార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తిమార్గ పరిరక్షణ అనే మూడు అంశాలు నేపథ్యంగా ఆవిష్కారమైన త్రిమూర్తుల అంశావతార మహాపుణ్యక్షేత్రమైన గాణగాపుర ప్రతి నిత్యం భక్తుల సందడితో విరాజిల్లుతోంది. గురువులకే ఆది గురువైన దత్తాత్రేయుడు దివ్య నిర్గుణపాదుకలను దర్శించుకోవడానికి భక్తుల పరంపరం కొనసాగుతోంది. మహావిష్ణువు దశావతరాల పరంపరలో భాగంగా అత్రి, అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి రోజున శ్రీహరి దత్తాత్రేయుడుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా త్రిమూర్తుల అంశావతారమని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. దత్తాత్రేయ క్షేత్రంలో నిత్యం దిగంబర..దిగంబర.. శ్రీపాదవల్లభ దిగంబర అంటూ భక్తులు వేనోళ్ల కీర్తించుకునే గురుదైవం దత్తాత్రేయుల వారి నిండైన విగ్రహాలు గాణాపురలో వెలసి ఉన్నాయి.
కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్వితుడు
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఏకకాలంలో దర్శించుకుంటున్నామా అని భక్తులు పరవశించిపోయే మహాపుణ్యక్షేత్రమిది. దత్తాత్రేయుడి పాదుకలను దర్శించుకోవడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి నిత్యం వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. దివ్యపాదుకలతో పాటు కల్లేశ్వర ఆలయం, సంగమ భీమా దర్శనాలు ఇక్కడి విశేషం. శ్రీదత్త శరణం మమా అంటూ నిత్యం ఇక్కడ స్మరించుకోవడానికి భక్తులు తరలివస్తుంటారు. దత్తక్షేత్రంగా ప్రసిద్ధిపొందిన గాణగాపురలో ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శనం మాదిరిగానే దత్తాత్రేయుడు శ్రీగురు పాదుకలను ఒక గవాక్షంలో దర్శనం చేసుకుంటూ భక్తులు పునీతులవుతుంటారు. భీమ, అమర్జా అనే రెండు నదుల సంగమం కూడా ఇక్కడ ఉంది. దత్తాత్రేయుడి రెండో అవతారమైన శ్రీనరసింహస్వామి రూపం అని కూడా భక్తుల నమ్మకం. సంగమ భీమాదర్శనం, ఏకగవాక్షి ద్వారా శ్రీగురు పాదుకలను, శ్రీకల్లేశ్వర, శనిమందిరం, శ్రీఆంజనేయ స్వామి, పంచముఖ గణపతిని, అశ్వర్థ వృక్షాన్ని, నరసింహ సరస్వతి ఆలయం, మేడిచెట్టును దర్శించుకునే శ్రీదత్తాత్రేయ ఆలయం కలబుర్గి జిల్లా అఫ్జల్‌పుర తాలూకాలోని గాణగాపురలో వెలసి ఉంది.
ఆలయ పరిసరాల్లో భక్తుల పాట్లు
దత్తాత్రేయ ఆలయ పరిసరాల్లో సమస్యలు తిష్టవేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కొలువుదీరారని భక్తులు విశ్వసించే, పురాణాలు ఘోషించే శ్రీదత్తాత్రేయ ఆలయ ముఖ ద్వారం ముందే రోడ్డు గుంతలమయంగా కనిపిస్తోంది. శ్రీకల్లేశ్వర, శనిమందిరానికి వెళ్లే దారి కంకర తేలి గుంతల మయంగా ఉండటంతో రెండు కిలోమీటర్ల దూరం మేర ఆలయం వద్దకు చేరుకునేందుకు నానాయాతన పడుతున్నారు. సంగమ, భీమా నదిలో స్నానాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు ఎంతో దూరం వచ్చే ఈ క్షేత్రంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. గాణగాపుర శ్రీదత్తాత్రేయ ఆలయానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు క్షేత్ర పరిసరాల్లో కల్పించాల్సిన రోడ్లు, స్వచ్ఛత తదితర మౌలిక సదుపాయాలపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మహామహిమాన్విత క్షేత్రంలో స్వచ్ఛత, పారిశుధ్యంపై ఆలయ కమిటీ నిర్వాహకులు, పాలకులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
దత్తాత్రేయుడు కొలువైన పుణ్యక్షేత్రం
గాణగాపుర
అస్తవ్యస్తంగా రోడ్లు, లోపించిన పరిశుభ్రత
సమస్యల నిలయం
సమస్యల నిలయం
Comments
Please login to add a commentAdd a comment