యశవంతపుర: ప్రైవేట్ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన కేసులో నేరగాళ్లను పట్టుకోవడానికి రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇందులో రూ. రెండు లక్షలు తీసుకుంటూ బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం పోలీసుస్టేషన్ ఏసీపీ తన్వీర్ ఎస్‌ఆర్, ఎఎస్‌ఐ కృష్ణమూర్తి లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు... ఇటీవల సైబర్ నేరగాళ్లు ఓ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సంస్థ యజమానులు సెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ తన్వీర్ రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకోవడానికీ రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. మొదట సగం చెల్లిస్తే నిందితులు ఎక్కడున్నా పట్టుకొంటామని భరోసా ఇచ్చారు. ఇలా మొదటి విడత లంచం సొమ్ము తీసుకొంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి లోకాయుక్త దాడి నగర పోలీసులను కలవరపెట్టింది. నిందితులను విచారణ చేపట్టారు.
లోకాయుక్త వలలో పీడీఓ
దొడ్డబళ్లాపురం: కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఒక పీడీఓ లోకాయుక్తకు చిక్కిన సంఘటన కనకపుర తాలూకా సోమదప్పనహళ్లి గ్రామపంచాయతీ ఆఫీసులో జరిగింది. పీడీఓ మునిరాజు, కాంట్రాక్టర్ వెంకటాచలయ్య పనులకు బిల్లులు పాస్ చేయడానికి రూ.20వేలు లంచం డిమాండు చేశాడు. దీంతో కాంట్రాక్టర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. బుధవారంనాడు లంచం తీసుకుంటూ ఉండగా మునిరాజును లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ. 2 లక్షల లంచం, సైబర్‌క్రైం ఠాణా ఏసీపీ అరెస్టు