సాక్షి,బళ్లారి: దేశాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయ శాఖతో (శాసకాంగ, కార్యాంగ, న్యాయాంగ)తో పాటు పత్రికల(మీడియా) పాత్ర కూడా ఎంతో కీలకమని జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో పత్రికా భవన్‌లో కర్ణాటక కార్యనిరత పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫోటో జర్నలిస్ట్ పురుషోత్తం హంద్యాళకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మూడు పిల్లర్లతో ఏ భవనం నిర్మాణం సాధ్యం కాదన్నారు. అదే విధంగా దేశాభివృద్ధితో కాని, రాష్ట్రాభివృద్ధి, జిల్లాభివృద్ధిలో కాని ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో, సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలియజేసేందుకు నాలుగో స్తంభంగా మీడియా పాత్రను మరువలేనిదన్నారు. పాత్రికేయులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు కళాకారులుగా అప్పుడప్పుడు మారడంతో ఉపశమనం పొందేందుకు వీలవుతుందన్నారు. మన సంస్కృతి వారసత్వాలను కాపాడుకునేందుకు కళాకారులు ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు. సన్మానం అందుకున్న పురుషోత్తం మాట్లాడుతూ కళాకారుడుగా చేసిన సేవలను గుర్తించి తనను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. డీపీఆర్‌ఓ గురురాజ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య నాలుగో స్తంభం మీడియా
జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా