
లోకాయుక్త వలలో సీడీపీఓ
రాయచూరు రూరల్: లోకాయుక్త వలలో సీడీపీఓ వనజాక్షి చిక్కిన ఘటన యాద గిరిలో చోటు చేసుకుంది. యాదగిరి సీడీపీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వనజాక్షి అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్న సహాయకురాలి అటెండెన్సు పుస్తకంలో హాజరును సక్రమం చేయడానికి రూ.లక్ష డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం యాదగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.80 వేలు లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారి ఇనాందార్ ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటనపై సీఐ సంగమేష్, సిద్దరాయ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బళ్లారిలో వర్షం .. ప్రజల్లో హర్షం
బళ్లారిటౌన్: నగరంలో శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా ఎండ తీవ్రతతో సతమతమవుతుండగా రెండు మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండటంతో ప్రజలకు వేసవి ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. కాగా సాయంత్రం కూడా మళ్లీ వర్షం కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి ఊరట కలిగింది.
భర్తను చంపిన భార్య అరెస్ట్
సాక్షి,బళ్లారి: అక్రమ సంబంధం వ్యామోహంలో కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బెళగావి జిల్లా శహాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త శివనగౌడ పాటిల్ అనే వ్యక్తిని భార్య శైల దారుణంగా హత్య చేసి ఏమీ తెలియనట్లుగా నటించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో రుద్రప్ప, శైల మధ్య ఏర్పడిన అక్రమ సంబంధంతో రుద్రప్ప సహాయంతో భర్తను హత్య చేయించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి
దారుణ హత్య
హుబ్లీ: బీదర్ శివారు ప్రాంతంలోని చిక్కపేటె అలియాబాద్ రింగ్ రోడ్ సమీపంలో ఢాబా వద్ద శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య జరిగింది. ఆ తాలూకాలోని వక్కికేరి నివాసి, గ్రామ పంచాయతీ సభ్యుడు వైజనాథ దత్తాత్రేయ(50) హతుడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తల, కడుపు భాగంలో మారణాయుధాలతో నరికి, చాకుతో పొడిచి దారుణంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఘటనపై నూతన నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

లోకాయుక్త వలలో సీడీపీఓ

లోకాయుక్త వలలో సీడీపీఓ