
కనువిందుగా రథోత్సవం
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగరజిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని ముగళూరు పంచాయతీ పరిధిలో ఉన్న దొడ్డతిమ్మసంద్ర గ్రామంలో వెలసిన తిరుమల వీరాంజనేయ స్వామి, జేష్టాదేవి సమేతంగా వెలసిన శని మహాత్మస్వామి బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తిని గరుడ వాహనం మీద ఊరేగింపుగా తీసుకొచ్చి తేరులో ఆసీనుల్ని చేసి రథాన్ని లాగారు. జానపద కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
అదృశ్యమైన బాలల
ఆచూకీ లభ్యం
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని భద్రావతి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఒక గ్రామంలో కనిపించకుండా పోయిన ఐదుమంది బాలల ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రులు హమ్మయ్య అనుకున్నారు. ఓ గ్రామంలోని 8 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న ఐదు మంది బాలలు ఈ నెల 6వ తేదీన సాయంత్రం దగ్గరలోని నీటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు రాత్రంతా చెరువులు, నీటికుంటల్లో గాలించినా జాడ లేదు. దీంతో ఏమైపోయారోనని విలపించారు. గ్రామస్తులు కూడా చుట్టుపక్కల అడవిలో వెతికారు. సోమవారం ఉదయం ముగ్గురు బాలలు కనిపించారు. మరో ఇద్దరు చెరుకు తోటలో ఉన్నట్లు చెప్పారు. చేపలు పట్టుకోవడానికి వెళ్లినట్లు తెలిస్తే ఇంటిలో తిడతారని భయపడి ఇంటికి రాలేదని చెప్పారు.
కాంట్రాక్టు ఉపాధ్యాయుని అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం: బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపిన సంఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో జరిగింది. నిందితుడు శివరాజ్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. పాఠశాల పక్కనే ఉన్న ఇంట్లో ఉంటున్న 14 ఏళ్ల బాలికపై కన్నేసిన శివరాజ్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులతో చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరాజ్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
అమ్మవారికి విశేష పూజలు
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి పరంగిపాళ్యలో గ్రామదేవత మారమ్మదేవి అమ్మవారికి సోమవారం విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహామంగళ హారతి తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు.
ఉత్తర కన్నడలో
కోతిజ్వరం కేసులు
దొడ్డబళ్లాపురం: ఉత్తర కన్నడ జిల్లాలో నలుగురికి మంకీ ఫివర్ సోకింది. సిద్ధాపురలో 14 ఏళ్ల బాలునికి, శిరసిలో 58 ఏళ్ల మహిళకు, హొన్నావరలో ఇద్దరు మహిళలకు కోతి జ్వరం సోకినట్టు అధికారులు తెలిపారు. వీరు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. పరీక్షలు చేయగా ఇది నిర్ధారణ అయ్యింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఈ రోగం ప్రబలుతోంది. దీంతో కొన్ని రోజులపాటు రైతులు, గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లరాదని తెలిపారు.
మంత్రి.. అయ్యారు కూలీ
శివమొగ్గ: ప్రభుత్వ పాఠశాలకు కాంపౌండ్ నిర్మాణంతో పాటు మధ్యాహ్నం భోజనం వండే గదుల నిర్మాణం జరుగుతోంది. ఇంతలో మంత్రి వచ్చి కొంతసేపు కూలీగా మారిపోయారు. ఈ అరుదైన సంఘటన సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని సొరభ తాలూకా హురళి గ్రామంలో జరిగింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తలపాగా కట్టుకుని పనిలోకి దిగారు. గడారుతో మట్టిని తవ్వి, తట్టలో ఎత్తుకుని పక్కకు పడేశారు. ఎండలోనూ పనిచేశారు.

కనువిందుగా రథోత్సవం

కనువిందుగా రథోత్సవం

కనువిందుగా రథోత్సవం