
అకాల వర్షం.. అపార నష్టం
సాక్షి,బళ్లారి: గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తుంగభద్ర ఆయకట్టు కింద పంటల సాగుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. సాధారణంగా ప్రతి ఏటా తుంగభద్ర ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ రెండు పంటలకు నీరు అందించే విధంగా డ్యాంలో తగినంత నీరు నిల్వ చేరేది. గత ఏడాది ఖరీఫ్ పంటకు సరిపడే విధంగా మాత్రమే నీరు చేరడంతో రబీకి క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో ఒకే ఒక పంట పండించుకుని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో ఖరీఫ్‌తో పాటు రబీకి కలిపి రెండు పంటలకు సరిపడేంత నీరు చేరడంతో రైతులు రెండు పంటలు పండించుకునేందుకు మార్గం సుగమమైంది. ఖరీఫ్‌లో ఆయకట్టు కింద వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు చేతికందాయి. ప్రస్తుతం రబీలో ఆయకట్టు కింద సాగు చేసిన వరి కోత దశకు చేరుకుంటోంది.
నాలుగు జిల్లాల్లో భారీగా వరి సాగు
తుంగభద్ర ఆయకట్టు పరిధిలో ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, వీస్తున్న ఈదురు గాలులకు వరి పంట అక్కడక్కడ నేలకొరుగుతోంది. పంట చేతికందే దశలో ఆకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందనే భయం రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పెద్దగా నష్టమేమీ జరగకపోయినా మళ్లీ ఇదే తరహాలో పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీచి వర్షాలు కురిస్తే ముప్పు తప్పదని రైతులు భావిస్తున్నారు.
ఈదురుగాలి, వానలకు
నేలకొరుగుతున్న వరి పంట
కోతలు పూర్తయ్యే వరకు రైతులకు
గుండె దడ
వర్ష బీభత్సంతో పంట నష్టం పరిశీలన
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాలో సంభవించిన అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం సంభవించింది. మాన్వి, సురపుర, శహపుర, హుణసిగి, దేవదుర్గ, సింధనూరు తాలూకాల్లో వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. ఆదివారం చిన్న నీటి పాదరుల శాఖ మంత్రి బోసురాజు, మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అకాల వర్షం వల్ల దెబ్బ తిన్న వరి పంటలను పరిశీలించారు. సింధనూరు తాలూకా రౌడకుంద, జవళగేర, రాగలపర్వి, బూదిహాళ క్యాంప్, హుడా, గొరేబాళ్, సోమలాపుర, మాన్వి ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంటలు చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కాటు వేశాడని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. బసనబాదర్లి మాట్లాడుతూ తహసీల్దార్ నష్టం అంచనాలను తయారు చేసి సర్కార్‌కు నివేదిక పంపాలని ఆదేశించారు.

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం