
నీటి కుంటలో పడి అక్కాచెల్లి మృతి
చిక్కబళ్లాపురం: పొలాల్లో ఫారం పాండ్స్ పేరుతో నీటి గుంతలను నిర్మించడం పెరిగింది. ప్లాస్టిక్ షీటు పరిచి నీరు త్వరగా ఇంకిపోకుండా చేస్తారు. కానీ ఇది చిన్నారుల పాలిట మృత్యుకూపమవుతోంది. వాటిలో పడిపోయి, ప్లాస్టిక్ పేపరు మీద నుంచి బయటకు రాలేక చనిపోతున్నారు. ఇలాంటి దుర్ఘటన చిక్కబళ్లాపురం జిల్లాలోని చేళూరు తాలూకా కురప్పల్లి గ్రామంలో జరిగింది. రాధ (17), సాహితీ (14) అనే అమ్మాయిలు మరణించారు. రాధ, సాహితీ వేసవి సెలవులు కావడంతో తల్లితో కలిసి పొలానికి వెళ్లారు. అక్కడ నీటి కుంటలోకి జారిపడిపోయారు. వారికి ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగిపోయారు. తల్లి గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచింది. వారు చేరుకుని ఇద్దరినీ బయటకు తీసేటప్పటికి ఊపిరి వదిలారు. కళ్లముందే కూతుళ్లు దూరం కావడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. ఘటనాస్థలిని చేళూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.