
పిల్లలకు మాతృభాష అవసరం
బళ్లారిటౌన్: నేడు పోటీతత్వ ప్రపంచం వల్ల ఇంగ్లిష్‌పై వ్యామోహంతో మాతృభాషను కనుమరుగు చేస్తున్నారని, పిల్లలకు మాతృభాషను కూడా పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వీరశైవ విద్యావర్థక సంఘం కార్యదర్శి, సాహితీవేత్త డాక్టర్ అరవింద్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం కొట్టూరు స్వామి ఉపాధ్యాయ కళాశాలలో కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిరిగేరి బసవరాజ్ స్మారక దత్తి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. త్రిభాష కంటకాలతో మాతృభాషకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా హిందీ, ఇతర దేశాల్లో పని చేసేందుకు ఇంగ్లిష్ భాషల వల్ల మన ప్రాంతీయ భాషలపై నేటి విద్యార్థుల్లో పట్టు సడలిందన్నారు. ఇలాంటి దత్తి కార్యక్రమాలు కన్నడ భాషకు ఊపిరి పోస్తాయన్నారు. కసాప జిల్లా అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప మాట్లాడుతూ సిరిగేరి బసవరాజ్ కన్నడ భాష అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడన్నారు. అంతేగాక క్రీడలకు కూడా ఎంతో ప్రోత్సాహం కల్పించేవారని గుర్తు చేశారు. ఆయన పేరిట గత ఐదేళ్లలో 221 దత్తి కార్యక్రమాలు జరిగాయన్నారు. డిసెంబర్ నెలలో జిల్లాలో రాష్ట్ర స్థాయి కసాప సమ్మేళనానికి అందరూ సహకారం అందించి విజయవంతం చేయాలన్నారు. దత్తి దాతలు సిరిగేరి పన్నరాజు, సిరిగేరి జయన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాదెప్ప, గంగావతి వీరేష్, ప్రిన్సిపాల్ సతీష్ హిరేమఠ, బసవరాజు పాల్గొన్నారు.