
ఎట్టకేలకు చిరుత బందీ
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆనెగుందిలో గత వారం రోజులుగా జనావాస ప్రాంతంలో కనిపిస్తూ ఆందోళన కలిగించిన చిరుత పులి ఎట్టకేలకు బందీ అయింది. అర్ధరాత్రి ఆహారం కోసం వెదుక్కుంటూ వచ్చిన చిరుతపులి ఆనెగుందిలోని తళవార ఘాట్ వద్ద అటవీ శాఖ ఉంచిన బోనులో చిక్కింది. ఉదయం నడకకు వెళ్లిన కొందరు యువకులు బోనులో చిక్కుకున్న చిరుతను గమనించారు. వారు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన అటవీ శాఖ అధికారులు చిరుతను సురక్షితంగా వడ్డరహట్టిలోని ఫారానికి తరలించారు. బందీగా ఉన్న చిరుత పులి వయస్సు దాదాపు మూడేళ్లు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చిరుతను సురక్షిత అటవీ ప్రదేశంలో వదిలివేస్తామని తెలిపారు. చిరుతపులి కనిపించిన నేపథ్యంలో ఆనెగుంది గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు హులిగెమ్మ నాయక్ అటవీ శాఖ అధికారులకు లేఖ రాసి చిరుతను పట్టుకోడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో చేపట్టిన ఆపరేషన్ చీతా చివరకు విజయవంతమైంది.