
నయన మనోహరం హసికరగ ఊరేగింపు
శనివారం అర్థరాత్రి చారిత్రక ద్రౌపదీ దేవి పూలకరగ
బనశంకరి: బెంగళూరు తిగళరపేటె ధర్మరాయ స్వామి దేవస్థానంలో వెలసిన ద్రౌపదీ దేవి కరగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి కబ్బన్ పార్కులోని సంపంగి చెరువు శక్తిపీఠంలో కరగ పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున హసికరగను కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర ఎత్తుకుని వీరకుమారుల సమక్షంలో ఊరేగింపుగా ధర్మరాయ దేవస్థానానికి చేరుకున్నారు. కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర ఒక చేతిలో కత్తి పట్టుకుని నడుముపై హసికరగను ఎత్తుకుని వీరకుమారుల సమక్షంలో ఊరేగింపుగా బయలుదేరారు. సంపంగి చెరువు అనంతరం హడ్సన్ సర్కిల్ వరకు ఊరేగింపుగా వెళ్లి బీబీఎంపీలో ఉన్న ఆదిశక్తి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మరాయ స్వామి ఆలయానికి హసికరగ చేరుకుంది. ఆలయంలో మల్లెపూల మధ్యలో హసికరగను అధిష్టించి ప్రత్యేక పూజలు చేపట్టారు.
అతి పురాతన చారిత్రక నేపథ్యం కలిగిన ద్రౌపదీ దేవి కరగ శక్త్యోత్సవం శనివారం అర్థరాత్రి ధర్మరాయ స్వామి దేవస్థానం నుంచి కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర ఎత్తుకుని నగర ఊరేగింపునకు బయలుదేరుతుంది. అంతకు ముందు తిగళర పేటెలో ధర్మరాయ స్వామి రథోత్సవం ప్రారంభమౌతుంది. ద్రౌపదీ దేవి కరగ గణపతి దేవస్థానం, ముత్యాలమ్మ దేవస్థానంలో పూజలు చేపట్టి హలసూరుపేటె ఆంజనేయస్వామి, రామ దేవస్థానం, నగర్తపేటె, కబ్బన్‌పేటె, గాణిగరపేటె, దొడ్డపేటె నుంచి కేఆర్.మార్కెట్‌కు చేరుకుంటుంది. మస్తాన్‌సాబ్ దర్గాను సందర్శించి అక్కడ నుంచి బళేపేటె పాత గరడి, అణ్ణమ్మ దేవస్థానం, కిలారు రోడ్డు, యలహంక గేట్, అవెన్యూ రోడ్డు, కుంబారపేటె, గొల్లరపేటె, తిగళరపేటెలోని ధర్మరాయ స్వామి దేవస్థానానికి చేరుకోవడంతో కరగ మహోత్సవం ముగుస్తుంది.

నయన మనోహరం హసికరగ ఊరేగింపు

నయన మనోహరం హసికరగ ఊరేగింపు

నయన మనోహరం హసికరగ ఊరేగింపు