
శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం
హొసపేటె: హనుమ జయంతిలో భాగంగా శనివారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆనెగుంది సమీపంలోని అంజనాద్రి కొండను భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. హనుమ జయంతి, రెండో శనివారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో, ప్రతి సంవత్సరం కంటే ఈ సారి ఎక్కువ మంది హనుమ భక్తులు కొండకు వచ్చారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివచ్చారు. జిల్లా నుంచి, జిల్లా వెలుపల, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి అంజనాద్రిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా మంది మాలధారులు కొండ వద్దకు చేరుకుని మాల విసర్జన చేశారు. హనుమంతుని విగ్రహానికి అభిషేకం చేసి, పూలమాలలతో, దీపాలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
అంజన్నకు ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: జిల్లాలో హనుమ జయంతిని ఘనంగా ఆచరించారు. శనివారం నగరంలోని ఐబీ రోడ్డులో వెలసిన వరసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. హనుమంతుడికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. భక్తులు ఊయల సేవ, అభిషేకం తదితర పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఉత్సవానికి స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే హాజరు
నగరంలోని వీరాంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, శానన సభ్యుడు శివరాజ్ పాటిల్ పాల్గొని హనుమంతుడికి పూజలు చేశారు. ప్రభుత్వ ఉద్యానవనంలో, హనుమాన్ ఆలయంలో అర్చకుడు నరేంద్ర భక్తులకు పూజలు జరిపి అన్నప్రసాదం చేశారు. బసవన బావి చౌక్‌లోని ఆలయంలో హిందూ జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో గద పూజలు జరిపి అన్నసంతర్పణం గావించారు.
భక్తులతో అంజనాద్రి కొండ కిటకిట
ఘనంగా హనుమ జయంతి వేడుక

శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం