
తగ్గిన మెట్రో ట్రిప్పులు.. ప్రజలకు చిక్కులు
బనశంకరి: అంబేడ్కర్ జయంతి ప్రభుత్వ సెలవు అనే కారణంతో నమ్మ మెట్రో రైలు సర్వీసులు తగ్గించి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టింది. మెట్రోరైళ్లు తగ్గడంతో ప్రయాణికులు ఉన్నవాటిలో కిక్కిసిరి ప్రయాణించారు. బీఎంఆర్‌సీఎల్ తీరుపై శాపనార్థాలు పెట్టారు. సాధారణ రోజుల్లో ఉదయం పీక్ అవధిలో 3 లేదా 5 నిమిషాలకు ఒక మెట్రోరైలు సంచరిస్తుంది. సోమవారం 10 నుంచి 15 నిమిషాలకు ఒక రైలు తిరగడంతో ప్రయాణికులు తెల్లమొహం వేశారు. మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. ప్లాట్‌పారం నిండిపోయి ఇతర అంతస్తుల్లో బారులు తీరారు. ప్రభుత్వ సెలవురోజు, ఆదివారం ట్రిప్పుల మధ్య అవధిని పెంచుతారు. ఒకరైలు వెళ్లిన తరువాత 10 నిమిషాలకు మరో రైలు వస్తుంది. సోమవారమూ అదే జరిగింది. కానీ అంబేడ్కర్ జయంతి కి ప్రైవేటు రంగం, ఐటీ బీటీ సంస్థలు మామూలుగానే పనిచేశాయి. యథావిధిగా ఉద్యోగులు, జనం వచ్చినా రైళ్లు లేక అవస్థలు పడ్డారు.
జనం ఆగ్రహావేశాలు
దీనిపై సోషల్ మీడియాలో ప్రయాణికులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులారా, చూడండి అని ఫిర్యాదు చేశారు. దిలీప్ అడిగ అనే ప్రయాణికుడు ట్వీట్ చేసి, మెజస్టిక్ మెట్రోస్టేషన్‌లో అస్తవ్యస్తంగా మారిందని, ఎక్కడ చూసినా ప్రయాణికులే ఉన్నారని, బీఎంఆర్‌సీఎల్ కు టికెట్ ధరలు ముఖ్యం తప్ప ప్రజలు కాదని మండిపడ్డాడు. కాగా రద్దీ వల్ల అదనంగా రైలు సర్వీసులను నడిపినట్లు మెట్రో అధికారులు చెప్పారు.
మెట్రో స్టేషన్లలో విపరీత రద్దీ
ప్రయాణికుల మండిపాటు