సత్తుపల్లిటౌన్: చదివేది ఏడో తరగతి.. తెలుగు మాతృభాష కూడా కాదు.. కానీ ఆ విద్యార్థిని వేమన శతకంపై ద్వాదశ పృచ్ఛక అవధానంలో సత్తా చాటింది. సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రానున్న ఉగాదిని పురస్కరించుకుని గార్లపాటి, బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ఈ అవధానంలో డీఈఓ సోమశేఖరశర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వశాంతి పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని మహ్మద్ అఫ్రియా పాల్గొని వేమన శతకంపై 12 మంది పృచ్ఛకులతో నిర్వహించిన ద్వాదశ ఫృచ్చక అవధానంలో ప్రతిభ కనబరిచింది. డీఈఓతో పాటు కళాశాలకు చెందిన విద్యార్థులు, అతిథులు పృచ్ఛకులుగా శతకంపై వివిధ అంశాల్లో ప్రశ్నలు సంధించగా.. తడుముకోకుండా సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా అఫ్రియాను సత్కరించారు. అలాగే, ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వంశీ, పోతురాజు వేమన శతకంపై అవధానం చేస్తున్న విషయాన్ని డీఈఓకు వెల్లడించగా అభినందించారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వై.మహేష్, బొల్లేపల్లి, గార్లపాటి ట్రస్ట్ నిర్వాహకులు బి.మధుసూదన్ రాజు, జి.రామకృష్ణ, ఎంఈఓలు నక్కా రాజేశ్వరరావు, సత్యనారాయణ, అధ్యాపకులు పూర్ణచంద్రరావు, మాధవి, బాలిక తల్లిదండ్రులు ఉస్మాన్, రాబియా, హెచ్‌ఎం యాకోబు, శేషగిరిరావు, మాలతి, ఆర్.శ్రీను పాల్గొన్నారు.
ప్రతిభ చాటిన విద్యార్థిని మహ్మద్ అఫ్రియా