
రంజాన్ వేళ విషాదం
● చెరువులో మునిగి తండ్రీకుమారుడి మృతి ● తండ్రిని రక్షించే క్రమాన కుమారుడు కూడా కన్నుమూత
బోనకల్: ముస్లింలంతా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటుండగా ఆ కుటుంబంలో మాత్రం విషాదం నెలకొంది. చెరువులోకి దిగిన తండ్రిని కాపాడే యత్నంలో కుమారుడు కూడా గుంతలో చిక్కుకుని మృతి చెందిన ఘటన బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.... ఆళ్లపాడుకు చెందిన పఠాన్ యూసుఫ్ ఖాన్(72)కు మతిస్థిమితం సక్రమంగా ఉండడంలేదు. సోమవారం ఉదయం వారి ఇంటి ఎదురుగా ఉన్న చెరువులోకి ఓ గేదె వెళ్లడాన్ని చూసిన ఆయన సైతం దిగాడు. ఈ విషయాన్ని గమనించిన యూసుఫ్ పెద్ద కుమారుడు కరీముల్లా(45) తండ్రిని బయటకు తీసుకురావడానికి చెరువులోకి దిగాడు. అయితే, ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ చెరువులో గత ఏడాది మట్టి తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా నీట మునిగి మృతి చెందారు. దీంతో పండుగ వేళ నెలకొన్న విషాదంతో వారి కుటుంబీకుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. యూసఫ్ ఖాన్‌కు భార్య, ముగ్గురు కుమారుల ఉండగా, కరీముల్లాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆళ్లపాడు చెరువులో గతంలోనూ ముగ్గురు మృతి చెందగా, ప్రస్తుత ఘటనతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.

రంజాన్ వేళ విషాదం