
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం రీచ్‌ల పరిశీలన
బోనకల్: ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తుండడంతో లబ్ధిదారులు ఇసుక కోసం ఇబ్బంది పడకుండా అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలోని వైరా ఏరు పరీవాహక గ్రామాలైన బ్రాహ్మణపల్లి, రాయన్నపేట, కలకోట, మోట మర్రిల్లో రీచ్‌లను మైనింగ్, రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. రీచ్‌ల్లో నాణ్యతతో పాటు లభ్యతను సర్వేయర్ సమక్షాన పరిశీలించినట్లు మైనింగ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ తెలిపారు. మండలంలోని 22గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక సరఫరాపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆర్‌ఐ మైథిలి, సర్వేయర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
కండక్టర్ నిజాయితీ..
మధిర: ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన పర్స్, నగదును ఆయనకు అందజేసిన కండక్టర్ నిజాయితీ చాటుకుంది. మధిర డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు బుధవారం విజయవాడ నుంచి మధిర వస్తోంది. మార్గమధ్యలో దిగిన అల్లూరి వెంకట కృష్ణారావు తన పర్స్ మర్చిపోగా, మధిర వచ్చాక కండక్టర్ ఇ.రాధిక గమనించింది. అందులో రూ.10,500 నగదు, ఇతర కార్డులు ఉండడంతో అందులోని నంబర్ ఆధారంగా వెంకటకృష్ణారావుకు ఫోన్ చేయగా, ఆయన రావడంతో పర్స్ అందజేశారు. దీంతో ఆయన కండక్టర్, డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సీపీఐ నాయకులపై
కేసు కొట్టివేత
ఖమ్మం లీగల్: పెట్రోల్ ధరలను అదుపు చేయాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలో పాల్గొన్న నాయకులపై నమోదైన కేసును ఖమ్మం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 2020 ఫిబ్రవరి 21న పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ సీపీఐ నాయకుడు భాగం హేమంతరావు ఆధ్వర్యాన నిరసన తెలపగా అప్పటి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, జానీమియా, పోటు కళావతి, సింగు నరసింహారావు, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనగా ఖమ్మం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా సరైన సాక్షాధారాలు లేనందున నాయకులపై కేసు కొట్టివేస్తూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. ముద్దాయిల తరఫున న్యాయవాదులు ఓరుగంటి శేషగిరిరావు, తోట రామాంజనేయులు వాదించారు.
మట్టి తరలిస్తున్న
వాహనాలు సీజ్
తిరుమలాయపాలెం: ఎలాంటి అనుమతులు లేకుండా మట్ట తరలిస్తున్న రెండు డంపర్లతో పాటు రెండు ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. తిరులాయపాలెం సమీపాన చేపట్టిన తనిఖీల్లో మట్టి తరలిస్తున్న వాహనాలకు అనుమతి లేదని గుర్తించారు. ఈసందర్భంగా వాహనాలను పోలీసులకు అప్పగించగా సీజ్ చేశారు.
జిల్లాకు ఈదురుగాలులు, వర్ష సూచన
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని వాతావరణంలో బుధవారం సాయంత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 5వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో బుధవారం సాయంత్రం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గగా.. వాతావరణ కేంద్రం ప్రకటించిన జాబితాలో ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలు కూడా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 2నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశముందని వెల్లడించడంతో ఉమ్మడి జిల్లాలో 40 – 41 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయితే, యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న చేతికి వస్తున్న వేళ ఈదురుగాలులు వీస్తాయని, వర్షం కురిసే అవకాశముందన్న సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వరి, మొక్కజొన్న కోతలు పూర్తిచేసి కల్లాల్లో ఆరబెట్టారు. అలాగే, మిర్చి కోతలు కూడా చివరి దశకు చేరాయి. ఈ సమయంలో వర్షం కురిస్తే నష్టపోయే ప్రమాదమున్నందున పంటల రక్షణలో రైతులు నిమగ్నమయ్యారు. ఇక ఈదురుగాలులు వీస్తే మామిడికాయలు రాలే ప్రమాదమున్నందున రైతులు, కౌలుదారుల్లో ఆందోళన నెలకొంది.
1.20 కేజీల గంజాయి స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్‌లో బైక్‌పై తరలిస్తున్న 1.20 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఆర్.కే.బజార్‌కు చెందిన ఎండీ.అబ్దుల్ ఫైసల్, బల్లేపల్లికి చెందిన ఎస్.కే.జమాల్, ఎస్.కే.సమీర్, ప్రకాష్‌నగర్‌కు చెందిన నల్లగట్ల దీపక్ ఖమ్మం నుండి ముదిగొండ వైపు ఒకే బైక్‌పై వెళ్తుండగా పోలీసులు తనిఖీచేశారు. వీరి వద్ద గంజాయి లభించడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.