
గల్లాపెట్టె గలగల..!
ఉమ్మడి జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది గణనీయమైన ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024 – 25 ఏడాదిలో 45,783 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.206.25 కోట్లు వచ్చాయి. 2023 – 24తో పోలిస్తే ఇది రూ.8 కోట్లు అదనమే అయినా.. 2022 – 23తో పోలిస్తే మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక గత ఆర్థిక సంవత్సరం కంటే తాజాగా ముగిసిన సంవత్సరంలో డాక్యుమెంట్లు పెరగడంతో అదేస్థాయిలో ఆదాయం నమోదైంది. 2024 – 25లో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మూడు జిల్లాల్లోనే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగ్గా.. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఉంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు పెరిగిన ఆదాయం
● గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.206.25 కోట్ల రాబడి ● ఉమ్మడి జిల్లాలో 45,783 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ● గత ఏడాదితో పోలిస్తే రూ.8 కోట్లు అ‘ధనం
11 కార్యాలయాలు..
ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తోపాటు ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 45,783 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా రూ.206.25 కోట్ల ఆదాయం వచ్చింది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ఈ ఆదాయం నమోదైంది. 2023 –24లో 44, 201 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.198.21 కోట్ల ఆదాయం సమకూరింది.
తగ్గిన రియల్ బూమ్..
హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల తర్వాత ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగేది. కానీ కొద్ది నెలలుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. ఖమ్మం చుట్టుపక్కల, రూరల్ ప్రాంతాల్లో కొద్దో గొప్ప వ్యాపారం నడుస్తున్నా.. జిల్లా కేంద్రంలో మాత్రం నామమాత్రమైంది. భూముల క్రయవిక్రయాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లూ జరగలేదు. రెండేళ్ల క్రితం 50వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగితే, గతేడాది నుంచి 50 వేల లోపే అవుతుండడం గమనార్హం. అయితే ఖమ్మంలో ప్రధాన రహదారుల వెంట ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే మళ్లీ వ్యాపారం ఊపందుకుంటుందని, తద్వారా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
2020–21 నుంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆదాయం ఇలా..
ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం (రూ.ల్లో)
2020-21 50,276 100,05,20,114
2021-22 57,570 206,68,18,974
2022-23 47,102 227,34,80,000
2023-24 44,201 198,21,00,000
2024-25 45,783 206,25,00,000
రూ.250 కోట్ల లక్ష్యం
ప్రభుత్వం ఈ ఏడాది (2025–26) స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేరకు ఆదాయం వచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందనున్నట్లు తెలిసింది.

గల్లాపెట్టె గలగల..!

గల్లాపెట్టె గలగల..!