
దరఖాస్తులు.. బారులు
స్వయం సంవృద్ధి సాధించేలా..
నిరుద్యోగులు సొంతంగా యూనిట్లు స్థాపించుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా అర్హులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేస్తారు. వందశాతం సబ్సిడీతో రూ.50వేల యూనిట్, 90 శాతం సబ్సిడీతో రూ.లక్ష, 80 శాతం సబ్సిడీతో రూ.2 లక్షలు, 70 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల విలువైన యూనిట్ల ఏర్పాటుకు అవకాశముంటుంది.
వెల్లువలా దరఖాస్తులు..
యూనిట్ల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో యువత దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా 18,525 దరఖాస్తులు వచ్చా యి. ఇందులో అత్యధికంగా ఖమ్మంఅర్బన్ నుంచి 1,788, ఖమ్మం రూరల్‌లో 1,433, కేఎంసీ పరిధిలో 1,361 దరఖాస్తులు రాగా, చింతకాని మండలంలో 1,069 దరఖాస్తులు నమోదవడం గమనార్హం. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యాన యూనిట్లకు 13,272, ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 5,350, మైనార్టీలకు సంబంధించి 2,301 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14తో గడువు ముగిశాక దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఆతర్వాత వారికి యూనిట్ గ్రౌండింగ్, నిర్వహణలో శిక్షణ ఇవ్వనున్నారు.
సర్టిఫికెట్ల కోసం హడావుడి..
దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. రేషన్‌కార్డు లేకపోతే ఆదాయ ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఆసక్తి ఉన్న వారు దరఖాస్తుకు మీ సేవ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. ఆపై తహసీల్దార్ కార్యాలయాల వద్ద కూడా రద్దీ ఉంటోంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 65,679 దరఖాస్తులు రాగా.. కుల ధ్రువీకరణ పత్రాల కోసం 13,566 దరఖాస్తులు రావడంతో తహసీల్దార్ కార్యాలయాల ఉద్యోగులు ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులకు జారీ చేస్తున్నారు.
ఆ మండలాల్లోనే పెండింగ్..
జిల్లాలో మొత్తం 164 మీసేవ సెంటర్లు ఉండగా.. అన్ని కేంద్రాలు రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని మండలాల్లో ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం అర్బన్ మండలంలో 9,243 దరఖాస్తులు అందగా 3,070 పెండింగ్‌లో ఉన్నాయి. రఘునాథపాలెం మండలంలో 2,264 దరఖాస్తులకు 1,002 మందికి మంజూరు చేశారు. ఇంకా 1,253 పెండింగ్‌లో ఉన్నాయి. సత్తుపల్లి మండలంలో 3,467దరఖాస్తులకు 2,180 మందికి జారీ చేయగా, 1,262 పెండింగ్‌లో ఉన్నాయి. తిరుమలాయపాలెం మండలంలో 2,829 దరఖాస్తులు అందగా, ఇంకా 906 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది.
కుల ధ్రువీకరణ అంతే..
కుల ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఖమ్మం అర్బన్ మండలంలోనే ఎక్కువగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 2,276 దరఖాస్తులు అందితే 1,025 మందికి జారీ చేయగా, 1,236 పెండింగ్ ఉన్నాయి. రఘునాథపాలెం మండలంలో 480 దరఖాస్తులకు 440, తిరుమలాయపాలెం మండలంలో 634కి 412, ఏన్కూరు మండలంలో 265 దరఖాస్తులకు గాను 155 పెండింగ్ ఉన్నాయి.
రాజీవ్ యువ వికాసం పథకం.. నిరుద్యోగులను దౌడ్ తీయిస్తోంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై యూనిట్లు అందజేయనుంది. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ చదివిన వారంతా అర్హులేనని ప్రకటించిన నేపథ్యాన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఈనెల 14తో గడువు ముగియనుండగా ఇప్పటివరకు 39,448 మంది దరఖాస్తు చేసకున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
‘రాజీవ్ యువ వికాసం’పై నిరుద్యోగుల ఆసక్తి
ఇప్పటి వరకు జిల్లాలో
39,448 దరఖాస్తులు
గడువు పెంపుతో
మరింతగా పెరగనున్న దరఖాస్తులు
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం హైరానా
సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నా..
రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశా. గత నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చివెళ్తున్నా. సర్టిఫికెట్ అందితే దరఖాస్తు చేసుకోవాలి. రుణం మంజూరైతే గేదెల యూనిట్ ఏర్పాటు చేసుకుంటా.
– కుంచం భిక్షం, భైరవునిపల్లి,
నేలకొండపల్లి మండలం

దరఖాస్తులు.. బారులు

దరఖాస్తులు.. బారులు