పులకించిన భక్త గిరి | - | Sakshi

పులకించిన భక్త గిరి

Apr 7 2025 12:50 AM | Updated on Apr 7 2025 12:50 AM

పులకి

పులకించిన భక్త గిరి

భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
● అభిజిత్‌ లగ్నంలో ఒక్కటైన జానకిరాములు ● కల్యాణోత్సవానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ● 11.57 గంటలకు మండపం వద్దకు మఖ్యమంత్రి ● కల్యాణం అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం

కల్యాణ ఘట్టాలు

ఉదయం 9:50 గంటలు :

కల్యాణ మండపానికి దేవేరుల

ఆగమనం

10:22 : విశ్వక్సేన పూజ

10:33 : పుణ్యావాచనం

10:49 : శ్రీయోద్వాహం

11:13 : యోక్త్రా బంధనం,

యజ్ఞోపవీత ధారణ

11:17 : శ్రీరాముడికి

పాద ప్రక్షాళన

11:19 : అలంకరణ

11:26 : మధుపర్క నివేదన

11:33 : మహా సంకల్పం

11: 46 : కన్యాదానం

11:57 : పట్టు వస్త్రాలు

సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

మధ్యాహ్నం 12:01 గంటలు :

అభిజిత్‌ లగ్నంలో వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం

12:13 : మాంగళ్య ధారణ

12:22 : తలంబ్రాల వేడుక

12:36 : స్వామి, అమ్మవార్లకు హారతి

సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు తన్మయత్వంతో వేడుకలను కనులారా వీక్షించి పులకించిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీ సమేతంగా వేడుకలకు హాజరై స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు మొదట గర్భగుడిలో మూలవిరాట్‌కు లఘు కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాక అభిజిత్‌ లగ్నంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్యధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాల వేడుక, హారతి సమర్పణతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు.

లగ్నానికి కొంచెం ముందుగా..

షెడ్యూల్‌ టైం ప్రకారం ఉదయం 10:45 గంటలకు భద్రాచలం ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకోవాలి, అక్కడ పూజా కార్యక్రమాలు చూసుకుని ఉదయం 11:10 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ ఆయన ఆలయానికి చేరుకునేసరికే ఉదయం 11:32 గంటలైంది. దీంతో అభిజిత్‌ లగ్నం సమయానికి సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణ మండపానికి చేరుకుని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తారా అనే సందేహాం ఏర్పడింది. సాధారణంగా సీతారాముల వివాహ తంతులో అలంకరణలు, మధుపర్కం నివేదించిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. మధుపర్కం కార్యక్రమం ముగిసినప్పటికీ సీఎం కల్యాణ మండపానికి చేరుకోకపోవడంతో ఆ తర్వాత ఘట్టమైన కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అర్చకులు ప్రారంభించారు. ఈ క్రమంలో అభిజిత్‌ లగ్నానికి మూడు నిమిషాల ముందు.. అంటే 11:57 గంటలకు రేవంత్‌రెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. వెంటనే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఘట్టం ముగియగానే అభిజిత్‌ లగ్నంలో మధ్యాహ్నం 12:01గంటల సమయంలో వధూవరులైన సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. ఆ తర్వాత ఇతర మంత్రులు, శ్రీరామదాసు, తూమూ నర్సింహదా సు వంశీయులు, త్రిదండి పీఠం, టీటీడీ తరఫున, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వస్త్రాలు సమర్పించారు.

ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా

సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మ గుడి దగ్గరున్న నాయక్‌పోడు తెగకు చెందిన బూరం శ్రీనివాస్‌ ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. ఇంటి ముందు కారు దిగి అక్కడున్న ప్రజలకు అభివాదం, దగ్గరగా ఉన్న వారికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ లోపలికి వెళ్లారు. శ్రీనివాస్‌ తల్లి పద్మావతి సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. అప్పటికే సీఎం రాక సందర్భంగా ‘ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దు. రోజు మీ ఇంట్లో ఎలా వంటలు చేస్తారో.. ఎలా తింటారో అవే ఏర్పాట్లు ఉండాలి’ అని జిల్లా అధికారులు సూచించడంతో రెండు గదులు ఉన్న ఆ ఇంట్లో మొదటి గదిలో సీఎం భోజనం చేసేందుకు చాప పరిచారు.

మునక్కాయ కూర.. గోంగూర చట్నీ

భోజనానికి సీఎం రేవంత్‌రెడ్డి కూర్చున్న వరుసలో బూరం శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీఎస్‌ శాంతికుమారి కూర్చోగా ఎదురు వరుసలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ కూర్చున్నారు. మంత్రి తుమ్మల భోజనం వడ్డింపు ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో భాగంగా నిల్చునే ఉన్నారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు రోజువారీగా ఉపయోగించే స్టీలు పళ్లెంలో సన్నబియ్యంతో చేసిన అన్నం, పులిహోర, పాయసం, గోంగూర చట్నీ, మునక్కాయ, దోసకాయ, టమాటా కూరలను వడ్డించారు. వీటితో పాటు మజ్జిగ, పెరుగు, పానకం కూడా సిద్ధం చేశారు.

ఖమ్మం వంటలు బాగుంటాయి

వడ్డింపు మొదలు పెట్టగానే ‘ఖమ్మం వంటలు బాగుంటాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటి ముద్ద తింటూనే.. ‘ఇంతకుముందు తుమ్మలనే ఈ వంటలు నాకు పరిచయం చేశారు’ అని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. భోజనం చేస్తూ మధ్యమధ్యలో ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు ఉచిత బస్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత కరెంట్‌ పథకాలు ఎలా ఉన్నాయంటూ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను సీఎం అడిగారు. పెరుగుతో భోజనం పూర్తి చేశారు. అంతకు ముందే రేవంత్‌రెడ్డికి వడ్డించే భోజనాన్ని ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు (టెస్ట్‌ అండ్‌ టే్‌స్ట్‌) పరిశీలించారు.

వీళ్లకు ఉద్యోగం చూడండి..

భోజనం పూర్తయిన తర్వాత శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి సాయం చేయాలంటూ సీఎంను పద్మావతి కోరారు. దీంతో వారికి అవసరమైన సాయం చేయాలంటూ కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చివరగా శ్రీనివాస్‌ తల్లిదండ్రులు శంకర్‌రావు, పద్మావతికి రేవంత్‌రెడ్డి వస్త్రాలు అందజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:21 గంటల వరకు మొత్తంగా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన కొనసాగింది.

పులకించిన భక్త గిరి1
1/6

పులకించిన భక్త గిరి

పులకించిన భక్త గిరి2
2/6

పులకించిన భక్త గిరి

పులకించిన భక్త గిరి3
3/6

పులకించిన భక్త గిరి

పులకించిన భక్త గిరి4
4/6

పులకించిన భక్త గిరి

పులకించిన భక్త గిరి5
5/6

పులకించిన భక్త గిరి

పులకించిన భక్త గిరి6
6/6

పులకించిన భక్త గిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement