
పెండింగ్ ఫిర్యాదులు పరిష్కరించండి
● ప్రతీ శుక్రవారం గ్రీవెన్స్ దరఖాస్తులపై సమీక్ష ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని, అధికారులు నివేదికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను ప్రజలకు వివరించాలే తప్ప పదేపదే తిప్పించుకోవద్దని సూచించారు. ప్రజావాణి ద్వారా వివిధ శాఖలకు 300పైగా దరఖాస్తులు పంపితే 151మాత్రమే పరిష్కారమయ్యాయని, సీపీఓ, డీఆర్‌డీఓ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల వద్ద ఎక్కువ పెండింగ్ ఉన్నందున దృష్టి సారించాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.