
విద్యార్థి చికిత్సకు ఉపాధ్యాయుల చేయూత
పెనుబల్లి: విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.. ఆపదలో వారికి అండగా నిలుస్తామని ఉపాధ్యాయులు నిరూపించారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన విద్యార్థికి చికిత్స చేయించడంలో నిరుపేదలైన తల్లిదండ్రులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిసి ఎంఈఓ సహా ఉపాధ్యాయులు రూ.లక్ష నగదు సమకూర్చారు. వివరాలు... మండలంలోని చౌడవరం గ్రామానికి చెందిన తొమ్మిది తరగతి విద్యార్థి సడియం వంశీ సోమవారం వీఎం బంజర జెడ్పీహెచ్‌ఎస్ నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్లే క్రమాన లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స ఖర్చుల కోసం ఎంఈఓ సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు రూ.65 వేలు సమకూర్చారు. మండలంలోని మిగిలిన పాఠశాలల ఉపాధ్యాయులు రూ.35వేలు ఇవ్వగా, మొత్తం రూ.లక్షల నగదును ఆస్పత్రి యాజమాన్యానికి చెల్లించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు వీ.వీ.రామారావు, వనమా నాగేశ్వరరావు, జి.వీరస్వామి, నాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.