
24గంటల్లోగా మిల్లులకు ధాన్యం
తల్లాడ/పెనుబల్లి/వేంసూరు/కల్లూరు రూరల్: కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోగా రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తద్వారా అకాల వర్షాల నుంచి పంటను కాపాడొచ్చని తెలిపారు. తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేయడంతో పాటు కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. ఈ మేరకు పెనుబల్లి మండలం నూతనకల్‌లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు గన్నీ బ్యాగ్‌లు, టార్ఫాలిన్ సంచులు, తేమ యంత్రాలు, వేయింగ్ మిషన్లు అందుబాటులో పెట్టాలని తెలిపారు. ఆతర్వాత మిట్టపల్లిలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల విచారణను పరిశీలించారు. పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్‌లోని రైస్ మిల్లును తనిఖీ చేయగా.. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని, రబీ సీజన్ సీఎంఆర్ గడువులోగా అందించాలని సూచించారు. అక్కడి తహసీల్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఇక వేంసూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తహసీల్‌ను తనిఖీ చేశారు. అలాగే, కల్లూరు మండలం పుల్లయ్యబంజరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్, కల్లూరు ఆర్డీఓ రాజేందర్, నూతనకల్ సొసైటీ అధ్యక్షుడు తూము వీరభద్రరావు, సీఈఓ రాకేష్, తహసీల్దార్లు గంటా ప్రతాప్, బాబ్జీప్రసాద్, పులి సాంబశివుడు, ఏఓలు తాజుద్దీన్, ఎం.రూప, దీపిక, ఉమామహేశ్వరరావు ఆర్‌ఐలు విజయ్‌భాస్కర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి