
ఈదురు గాలులకు నేలవాలిన వరి, మొక్కజొన్న
● వర్షంతో కొట్టుకుపోయిన కల్లాల్లోని మక్కలు, ధాన్యం ● మామిడితోటలపైనా తీవ్ర ప్రభావం ● జిల్లాలో 3,222 ఎకరాల్లో పంట నష్టం
పది బస్తాలు రావడమూ కష్టమే..
కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన ఈ రైతు పేరు కనమతిరెడ్డి వెంకటరెడ్డి. ఏడెకరాల్లో వరి సాగు చేసిన ఈయన ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాడు. కానీ భారీ వర్షం, ఈదురు గాలులకు పంట పూర్తిగా నేలవాలింది. కింద పడిన వరి పనలు కుళ్లిపోయే అవకాశముంది. ఉన్న కాసిన్ని పనలు కూడా కోయించి నూర్పిడి చేసే పరిస్థితి లేక ఎకరాకు 10 బస్తాలు కూడా రావడం కష్టమేనని వాపోతున్నాడు.
సాయంత్రమైతే చాలు..
ఈనెలారంభం నుంచి వాతావరణంలో మార్పులతో సాయంత్రమైతే చాలు వరుణుడు తన ప్రభావం చూపుతున్నాడు. మంగళవారం కూడా అర్ధరాత్రి 12–30నుంచి 2.30 గంటల వరకు పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసింది. పంట చేతికి అందే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులకు తీరని నష్టం మిగులుతోంది. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరగా రైతులు ఉత్సాహంగా యాసంగి పంటలు సాగు చేశారు. కానీ ఇప్పుడు అకాల వర్షాలతో వారి ఆనందం ఆవిరవుతోంది.
నేలవాలిన వరి, మొక్కజొన్న
ఈదురుగాలుల కారణంగా వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. సాధారణంగా పంట నిలువుగా ఉన్నప్పుడు హార్వెస్టర్లు ద్వారా కోయిస్తారు. కానీ పంట నేలవాలడంతో మిషన్లను ఉపయోగించడం కష్టంగా మారుతుందని, కూలీలైతే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు పంట నేలవాలడం, కొంత గింజ రాలిపోవడం కూడా రైతులపై అదనపు భారం పడనుంది.
ఆరబెట్టిన ధాన్యం తడిసి..
కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న పంటలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కొనుగోళ్లలో జాప్యంతో రహదారుల వెంట, కల్లాల్లో ఆరబోసిన పంట వర్షానికి కొట్టుకుపోగా రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటుచేసినా కాంటా, తరలింపు ఆలస్యమవుతుండడం.. ఇంతలోనే ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
3,222 ఎకరాల్లో నష్టం
ఈనెల రెండో వారం వరకు ప్రకృతి వైపరీత్యాలతో వైరా, తల్లాడ, కల్లూరు, మధిర, పెనుబల్లి మండలాల్లో సాగులో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాల్లోని 56 గ్రామాల్లో 1,672 మంది రైతులకు చెందిన 2,947 ఎకరాల్లో వరి, 27 మంది రైతులకు చెందిన 37 ఎకరాల్లో మొక్కజొన్న, 79 మంది రైతులకు చెందిన 226 ఎకరాల్లో మామిడి, నలుగురు రైతులకు చెందిన 12ఎకరాల్లో నువ్వుల పంటకు నష్టం జరిగింది. మొత్తం 1,782 మంది రైతులకు చెందిన 3,222 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా, ప్రకృతి వైపరీత్యాల సమయాన 33శాతం పంట నష్టం జరిగితే పరి హారం అందించాలనే నిబంధనలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఎకరాకు రూ.10వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, 1,782 మంది రైతులకు పరిహారం అందే అవకాశముంది.
నష్టం మిగిల్చిన వాన.. 8లో
పలు మండలాల్లో పంట నష్టం వివరాలు (ఎకరాల్లో)
మండలం వరి మొక్కజొన్న మామిడి నువ్వులు మొత్తం
వైరా 1,437 - 224 - 1,661
తల్లాడ 350 30 - - 380
కల్లూరు 1,018 06 - - 1,024
మధిర - - 2 - 02
పెనుబల్లి 142 1 - 12 155

ఈదురు గాలులకు నేలవాలిన వరి, మొక్కజొన్న