
ప్రపంచానికి నాయకత్వం వహించాలి
మధిర: మధిర నియోజకవర్గంలో వ్యవసాయదారులే ఎక్కువగా ఉన్నందున వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశామని.. తద్వారా నియోజకవర్గానికి మంచి భవిష్యత్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. నియోజకవర్గ యువతీ, యువకులు ప్రపంచానికి నాయకత్వం వహించేలా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మధిరలో సోమవారం ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాను భట్టి ప్రారంభించారు. తొలుత వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్ కళాశాలు ఉండగా.. ఐటీఐని అడ్వాన్వ్‌డ్ టెక్నాలజీ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలి పారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను యువత గుర్తించి భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అయితే, జాబ్‌మేళాలో వచ్చిన ఉద్యోగం చేస్తూనే మెరుగైన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఎవరికి వారు నమ్మకంతో ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని తెలిపారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
97 కంపెనీలు.. వేలాది మంది యువత
మధిరలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో సింగరేణి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 97 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈమేరకు 5,287 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 3వేల మందికి పైగా హాజరయ్యారు. ఎస్సెస్సీ మొదలు ఎంటెక్ చదివిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 2,325 మందిని ఎంపిక చేయగా కొందరికి డిప్యూటీ సీఎం నియామక పత్రాలు అందజేశారు. మరికొందరికి హైదరాబాద్‌లో తుది దశ ఇంటర్వ్యూల అనంతరం నియామకపత్రాలు ఇస్తామని ప్రతినిధులు తెలిపారు. చదువు పూర్తిచేసి ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న పలువురికి ఉద్యోగాలు లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, మధిరకు చెందిన సముద్రాల ప్రియాంకకు రూ.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం విశేషం.
ఊహించని ఉద్యోగమిది...
పాలిటెక్నిక్ పూర్తిచేశాను. స్నేహితులతో కలిసి జాబ్‌మేళాకు హాజరైనా ఉద్యోగం ఊహించలేదు. కానీ ఎంపవర్ సర్వీసెస్‌లో రూ.3లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపిక చేసి నియామకపత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో ఈ ఉద్యోగం దక్కింది.
– బి.ఉషారాణి, వంగవీడు
అపాయింట్‌మెంట్ లెటర్ కూడా..
జీఎన్‌ఎం చదువుతున్నా. జాబ్ మేళాలో ప్రీమియర్ హెల్త్ కేర్ సొసైటీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన నాకు ఉద్యోగం రావడంతో కుటుంబానికి అండగా నిలిచే అవకాశం దక్కింది. ఏటా రూ. 3లక్షల ప్యాకేజీతో లేఖ ఇచ్చారు.
– డి.తిరుపతమ్మ, వంగవీడు
ఇండస్ట్రియల్ పార్క్‌తో
మధిరకు ఉజ్వల భవిష్యత్
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
జాబ్‌మేళాలో 2,325 మంది ఎంపిక

ప్రపంచానికి నాయకత్వం వహించాలి

ప్రపంచానికి నాయకత్వం వహించాలి

ప్రపంచానికి నాయకత్వం వహించాలి