దృష్టి లోపం మటుమాయం..
● విద్యార్థులకు కంటి పరీక్షలు ● ఇప్పటికే 933 మంది గుర్తింపు ● అవసరమైన వారికి శస్త్రచికిత్స, కంటి అద్దాలు అందజేత
కెరమెరి: ప్రస్తుత కాలంలో గంటల తరబడి మొబైల్ ఫోన్ చూడడం, పాఠశాలల్లో కూడా ఎల్‌ఈడీ టీవీలతో పాఠాలు బోధించడం వల్ల అనేక మంది విద్యార్థుల్లో దృష్టిలోపం ఏర్పడింది. ఈ విషయాన్ని గు ర్తించిన ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో జిల్లా వ్యా ప్తంగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలల స్వస్థ్ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) బృందాల సమన్వయంతో ఆప్తోమెట్రిస్ట్‌లు అన్ని విద్యాసంస్థలకు వెళ్లి 45 వేల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 933 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. వారికి మళ్లీ సోమవారం నుంచి నేత్ర పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి శస్త్రచికిత్సతో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వనున్నారు.
మరో పది రోజులు
ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మరో పది రోజుల వరకు కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు వందమంది చొప్పున వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థల నుంచి నేరుగా అమ్మ ఒడి, ఆర్‌బీఎస్‌కే వా హనాల్లో విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. సోమ, మంగళవారాల్లో 208 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
అవసరమైన వారికి కంటి అద్దాలు
కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చిన్నతనంలోనే కంటి ఇబ్బందులు ఉంటే చదువుపై భారం పడుతుందని భావించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో అత్యధికులు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు ఉంటారని భావించిన ప్రభుత్వం దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించే పనిలో పడింది.
సద్వినియోగం చేసుకోవాలి
కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గతంలో పరీక్షల ద్వారా గుర్తించాం. ప్రస్తుతం వారికే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తాం. ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సీతారాం, జిల్లా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment