ఐదు వేల కేసుల పరిష్కారమే లక్ష్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్
ఆసిఫాబాద్‌రూరల్: ఐదు వేల కేసుల పరిష్కారమే లక్ష్యంగా మార్చి 8న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, అడ్వకేట్లతో గురువారం సీనియర్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమంతో కేసులు పరిష్కారమై కక్షిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ఏడాదిలో తొలిసారి నిర్వహించే లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే పంచాయితీలతో సమస్యలు పరిష్కరించుకుంటే ఎలాంటి చట్టబద్ధత ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయ సాయం అందించేందుకు జిల్లా కోర్టుతోపాటు సివిల్ కోర్టుల్లోనూ అడ్వకేట్లను నియమించిందని తెలిపారు. పేద ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment