అమ్మపాలు.. అమృతం.. | - | Sakshi
Sakshi News home page

అమ్మపాలు.. అమృతం..

Published Thu, Aug 1 2024 2:10 AM | Last Updated on Thu, Aug 1 2024 12:49 PM

అమ్మప

అమ్మపాలు.. అమృతం..

లబ్బీపేట(విజయవాడతూర్పు): బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల, మెదడు ఎదుగుదలతో పాటు, పిల్లలు చురుగ్గా ఉండేలా చేస్తాయి. కానీ పాశ్చాత్య సంస్కృతితో భాగంగా కొందరు సౌందర్యం తగ్గుతుందని మరికొందరు ఉద్యోగరీత్యా తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదు. ఇలాంటి చర్యలతో బిడ్డలతో సహా తామూ నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేకపోతున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావం గురించి అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంది. వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

శిశు మరణాల నివారణ....

ఎక్కువ మంది శిశువులకు ఇన్‌ఫెక్షన్స్‌లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాస కోశవ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయని యూనిసెఫ్‌ గుర్తించింది. అలాటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే అవగాహన కలిగిస్తున్నారు.

తల్లికీ ప్రయోజనాలు....

బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని అంటున్నారు. అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని పేర్కొన్నారు.

శిశువులకు ఎంతో మేలు

తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి.

తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్‌ వృద్ధి చెంది ఇన్‌ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు.

మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.

పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను వడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది.

ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు విటమిన్‌–ఎ అధిక మోతాదులో ఉంటాయి.

శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్‌ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.

పుట్టిన అరగంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించాలి తల్లిపాలతో వ్యాధి నిరోధకశక్తి పెరుగుదల తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువ నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాలు శ్రేష్టమైనవి
బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. శిశువుకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సాధారణ ప్రసవం అయితే పుట్టిన అరగంటలోపు, సిజేరియన్‌ అయితే నాలుగు గంటల్లోపు తల్లిపాలు పట్టించాలి. ముర్రుపాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా నివారిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలు చురుగ్గా ఉండటంతో పాటు తెలివితేటలు, జ్ఞాపకశక్తి మెండుగా ఉంటాయి.
– డాక్టర్‌ బి.సునీత, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పిల్లల వైద్య విభాగం, జీజీహెచ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement