వేరుశనగకు దక్కని మద్దతు ధర
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగకు మద్దతు ధర లభించడం లేదు. మొత్తం 1,656 క్వింటాళ్ల దిగుబడి రాగా మధ్య ధర రూ.6,379 పలికింది. క్వింటాకు కనిష్టంగా రూ.3,289 ధర ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా వేరుశనగకు రూ.6,783 మద్దతు ధర ఇచ్చిందని, అంతకంటే తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరతో వేరుశనగకొనుగోలు చేయాలని కోరుతున్నారు.
రేపు ప్రజల అర్జీల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఒక చోట రూ.10.. మరో చోట రూ.12
కర్నూలు(అగ్రికల్చర్): రైతులు తాము పండించిన టమాటను కిలోన్నర రూ.10 ప్రకారం అమ్ముతున్నారు. అయితే రైతు బజార్ సిబ్బంది మాత్రం కిలో టమాటాను రూ.12 ప్రకారం విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.10 ప్రకారం టమాటాలను కొనుగోలు చేశారు. కర్నూలు సి.క్యాంపు రైతుబజారుకు శనివారం 50 బాక్స్‌ల టమాటను పంపించారు. రవాణా చార్జీలు కలిపి కిలో రూ.12 ప్రకారం అమ్మాలని రైతు బజార్ సిబ్బంది చెప్పారు. అయితే రైతుబజార్లలో పలువురు రైతులు కిలోన్నర టమాటాలను రూ.10 ప్రకారం విక్రయించారు. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు పంపిన 50 బాక్స్‌ల్లో 10 బాక్స్‌లు మాత్రం అమ్మకం అయ్యాయి. ఇంకా 40 బాక్స్‌ల్లో టమాట నాణ్యత దెబ్బతింటోంది. మరో 100 బాక్స్‌ల టమాట సరఫరా చేస్తుండంతో సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
రేపు శ్రీశైలానికి రాష్ట్ర గవర్నర్ రాక
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సోమవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు శ్రీశైలం రా నున్నారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం రాత్రికి అతిథి గృహంలోనే బస చేసి మంగళవారం ఉదయం విజయవాడకు తిరిగి వెళ్తారు.
రద్దయిన సీఎం పర్యటన
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీఎం చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే వివిధ కారణాలతో సీఎం పర్యటన రద్దు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment