స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశీలన

Apr 10 2025 1:35 AM | Updated on Apr 10 2025 1:35 AM

స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశీలన

స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశీలన

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని స్టేట్‌ క్యాన్స ర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను బుధవారం డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.శాంతికళ పరిశీలించారు. పీసీ పీఎన్‌డీటీ కొత్త రిజిస్ట్రేషన్‌లో భాగంగా స్కానింగ్‌ గదిని తనిఖీ చేసి మిషన్‌కు సంబంధించిన పత్రాలు, వైద్యుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న ప్రీవెంటివ్‌ ఆంకాలజి విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం ఐదు రోజులు నోరు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను స్క్రీనింగ్‌ చేస్తారన్నారు. అనుమానిత కేసులను పీహెచ్‌సీ, యుపీహెచ్‌సీలకు పంపిస్తారని, అనంతరం స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్‌ చేస్తారని తెలిపారు. ఆమె వెంట స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ సీఎస్‌కే. ప్రకాష్‌, రేడియాలజిస్టు డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ ఉన్నారు.

‘ఉపాధి’లో 90 శాతం లక్ష్యాన్ని సాధించాలి

కర్నూలు(సెంట్రల్‌): ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో ముమ్మరంగా ఉపాధి హామీ పనులను కల్పించి 90 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వివిధ అంశాలపై డివిజన్‌, మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు రూ.286 సగటు కూలీ ఇచ్చినట్లు చెప్పారు. జూన్‌లోపు లక్ష్యం మేరకు ఫాంపాండ్స్‌ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తాగునీటి సమస్యకు సంబంధించి జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేసి సత్వరం పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జేసీ డాక్టర్‌ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, డ్వామా పీడీ వెంకట రమణయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.

మెగా డీఎస్సీకి

ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌

కర్నూలు(అర్బన్‌): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీకి ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన తెలిపారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ, ఎస్‌టీ, ఎస్‌సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె బుధవారం ఒక ప్రకటనలో కోరారు. తమ కార్యాలయంలో ఖాళీ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులను అందించేందుకు చివరి తేది, ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రారంభ తేది, కోచింగ్‌ కాల వ్యవధి తదితర వివరాలను అభ్యర్థులకు తగిన సమయంలో తెలియజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు బిర్లాగేట్‌ సమీపంలోని సంక్షేమభవన్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

సుంకేసులకు

1,850 క్యుసెక్కుల నీరు

కర్నూలు సిటీ: తుంగభద్ర డ్యాం నుంచి రోజుకు 5 వేల క్యుసెక్కుల నీరు విడుదల చేస్తుండగా సుంకేసుల బ్యారేజీలోకి 1,850 క్యుసెక్కులు వస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి నాలుగు రోజుల పాటు నీటిని విడుదల చేస్తుండగా బుధవారం సుంకేసులకు వచ్చి చేరాయి. మరో రెండు రోజుల పాటు నదిలో నీటి ప్రవాహం ఉండనుంది. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీలో 0.954 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఇందులో కొంత నీటిని కర్నూలు నగరవాసుల దాహార్తి తీర్చేందుకు విడుదల చేస్తున్నారు.

ముగిసిన ‘పది’ మూల్యాంకనం

కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షల మూల్యాంకనం బుధవారం ముగిసింది. ఈనెల 3వ తేదీన మొదలైన మూల్యాంకనానికి వివిధ జిల్లాల నుంచి మొత్తం 1,92,725 సమాధాన పత్రాలు జిల్లా వచ్చాయి. మొదటి రోజున స్పాట్‌ విధులు నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఉపాధ్యాయులు వివిధ కారణాలతో హాజరుకాలేదు. ఉపాధ్యాయుల సంఘాలతో అనుబంధం ఉన్న ఉపాధ్యాయులు పలు కారణాల చూపి స్పాట్‌ డ్యూటీ నుంచి మినహాయింపు తీసుకున్నారు. దీంతో కస్తూర్బా పాఠశాలల్లోని టీచర్లకు సైతం స్పాట్‌లో స్పెషల్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. రెగ్యులర్‌ పరీక్షలతో పాటు ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్ష మూల్యాంకనం సైతం ఆరు రోజుల పాటు నిర్వహించారు. ఇందుకు 16,220 సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చాయి. స్పాట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌గా డీఈఓ ఎస్‌.శామ్యూల్‌ పాల్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రభూషణ్‌, అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్‌గా ఓంకార్‌ యాదవ్‌ వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement