● క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
దేవరుప్పుల : మద్యం తాగడానికి డబ్బు అడగగా భార్య నిరాకరించడంతో క్షణికావేశానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేవరుప్పుల మండలం సీతారాంపురంలో చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన బత్తుల గోపి (27) కుటుంబంతో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి వలస వచ్చా డు. ఇక్కడ సమీప బంధువైన బత్తుల రామకృష్ణకు చెందిన ఇటుక బట్టీలో నాలుగు నెలల నుంచి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం మద్యం కోసం రూ.200 కావాలని భార్యను అడగగా నిరాకరించింది. దీంతో ఆమెతో గొడవపడ్డారు. క్షణికావేశంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.