
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అటవీ ప్రాంతంలోని గొత్తికోయ గూడేల్లో నివసిస్తున్న గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సమ్మక్క,సారక్క కల్యాణ మండపంలో ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో జిల్లాలోని 84 గొత్తికోయ గిరిజనులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా గూడేలకు నీరు సరఫరా చేయడంతోపాటు త్వరలో బోర్లు వేయిస్తానన్నారు. అడవులను నరకకుండా కాపాడాలన్నారు. గొత్తికోయ గిరిజనుల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం గొత్తికోయ గిరిజనులు మండలాల వారీగా తమ సమస్యలను మంత్రి సీతక్కకు వివరించారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, పిల్లల ఉన్నత చదువు కోసం కుల ధ్రువీకరణ పత్రాలు, రోడ్లు, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐలు రవీందర్, శంకర్, శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఎంపీడీఓ సుమనవాణి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేశ్‌బాబు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క