కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయం | - | Sakshi

కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయం

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

కాలం

కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయం

సీజ్‌ చేసిన పోలీసులు

కమలాపూర్‌: కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓ కిరాణా షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఏజెన్సీ గోదాంపై దాడులు జరిపి కాలం చెల్లిన పలు రకాల కూల్‌డ్రింక్స్‌ను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కిరాణా షాపు యజమాని, కొనుగోలుదారులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌కు చెందిన కెంసారపు తిరుపతి అనే కిరాణా షాపు నిర్వాహకుడికి కమలాపూర్‌లోని కూల్‌డ్రింక్స్‌ ఏజెన్సీ నిర్వాహకులు మౌటం ఓంప్రకాష్‌–హేమలత గత నెల 21న కొన్ని 200 ఎంఎల్‌ మాజా బాటిళ్లు సరఫరా చేశారు. వాటిని తిరుపతి కొందరు కొనుగోలుదారులకు విక్రయించగా డేట్‌ ఎక్స్‌పైర్‌ అయిట్లుగా వారు గుర్తించారు. దీంతో కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ ఎందుకు విక్రయిస్తున్నావని, ఇవి తాగితే తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ తిరుపతిని కొనుగోలుదారులు నిలదీశారు. దీంతో తిరుపతి తాను ఎక్స్‌పైర్‌ డేట్‌ను గమనించలేదని చెప్తూనే వెంటనే ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్‌ చేసి కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ ఎందుకిచ్చారని, వాటిని తీసుకెళ్లి వాటి స్థానంలో వేరే కూల్‌డ్రింక్స్‌ ఇవ్వాలని కోరాడు. దీంతో వారు తమకేమీ సంబంధం లేదని, కంపెనీ వాళ్లకు వాపస్‌ ఇచ్చుకోండంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా నానా దుర్భాషలాడారని తిరుపతి ఆరోపించాడు. అంతేకాకుండా కంపెనీ వాళ్లు ఇచ్చిన ఫ్రిజ్‌ బయట పెడితే తీసుకెళ్తామని ఫోన్లోనే వాగ్వాదానికి దిగారు. కొద్ది రోజులు వేచి చూసిన తిరుపతి గత నెల 31న కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2న పోలీసులు కమలాపూర్‌లోని కూల్‌డ్రింక్స్‌ ఏజెన్సీ గోదాంపై దాడులు జరిపి గోదాంలో నిల్వ ఉన్న కాలం చెల్లిన పలు రకాల కూల్‌డ్రింక్స్‌తోపాటు వాటర్‌, సోడా బాటిళ్లను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. రూ.15,483 విలువైన కూల్‌డ్రింక్స్‌ సీజ్‌ చేసి, ఏజెన్సీ నిర్వాహకుడు ఓం ప్రకాశ్‌ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రారావు తెలిపారు. కాగా, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, వారి అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తోందని, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయం1
1/1

కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ విక్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement