సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం

Apr 2 2025 12:27 AM | Updated on Apr 2 2025 12:27 AM

సన్నబ

సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెల్ల కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని మంగళవారం జిల్లావ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేదలకు సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టగా.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లాలోని 506 చౌకధర దుకాణాల్లో తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఒకరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ పంపిణీ వ్యవస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దొడ్డు బియ్యం అందజేసిన ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేటాయింపుల్లో ఆలస్యం

ప్రతినెలా 20వ తేదీ వరకే చౌకధర దుకాణాలకు రేషన్‌ కేటాయింపులు పూర్తవుతాయి. ఆ తర్వాత ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి లారీల్లో బియ్యాన్ని చేరవేస్తారు. అయితే ఈ నెలలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మార్చి 27న కేటాయింపుల ఉత్తర్వులు వెలువడ్డాయి. 28 నుంచి లారీల్లో సన్న బియ్యాన్ని రవాణా చేయడం ప్రారంభించారు. 30న ఉగాది, 31న రంజాన్‌ రావడంతో బియ్యం సరఫరా కాస్త ఆలస్యమైంది. జిల్లాలో ప్రస్తుతం 92.29 శాతం చౌకధర దుకాణాలకు సన్న బియ్యం చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఎమ్మెల్యేల చేతులమీదుగా..

జిల్లావ్యాప్తంగా 506 చౌకధర దుకాణాలకు సన్న బియ్యం చేరుకుంది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతులమీదుగా బియ్యం పంపిణీకి లాంఛనంగా శ్రీకారం చుట్టాం. అయితే మొదటి విడతలో ఒక్కో దుకాణానికి 50 శాతం మేర బియ్యాన్ని సరఫరా చేయించాం. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేలోపు మిగతా బియ్యం చేరవేస్తాం. రేషన్‌ కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తాం.

– వెంకటేష్‌, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి

మొత్తం కోటా రానప్పటికీ మొదటి విడతలో ఒక్కో చౌకధర దుకాణానికి 50 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. వీటిని పంపిణీ చేసేలోగా రెండో విడతలో బియ్యం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. కోటా ప్రకారం ఒక్కో దుకాణానికి 100 క్వింటాళ్ల నుంచి 200 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉంది. మొత్తం కోటా పంపిణీ ప్రతినెలా 15లోగా పూర్తి చేస్తారు. ఈ నెల కూడా గడువులోగా పూర్తి చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

జిల్లాలో 92.29 శాతం

దుకాణాలకు చేరిన బియ్యం

సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం 1
1/1

సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement