
దేవతామూర్తుల వస్తువుల స్వాధీనం
మతిస్థిమితం లేని మహిళ నుంచి
లింగాల: మతిస్థిమితం లేని ఓ మహిళ నుంచి వివిధ దేవతామూర్తుల విగ్రహాలకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనపర్చుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. లింగాలకు చెందిన ఓ మహిళ కొన్ని నెలలుగా మతిస్థిమితం కోల్పోయి స్థానికంగా తిరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మండలంలోని కోమటికుంటలో తిరుగుతున్న ఆ మహిళలను గమనించిన గ్రామస్తులు ఆమె దగ్గర ఉన్న సంచిని పరిశీలించగా అందులో విగ్రహాలకు సంబంధించిన వస్తువులను చూసి వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో గ్రామాన్ని సందర్శించి వస్తువులను స్వాధీన పర్చుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇందులో రాతి నాగపడిగెలు, వెండి కళ్లు, మీసాలు, ఇతర పంచలోహ వస్తువులు ఉన్నాయని, మహిళను ఎంత ప్రశ్నించినా వివరాలు చెప్పడం లేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మహిళలను పోలీసులు వెంట పెట్టుకొని పలు ప్రాంతాలను తిరిగినా వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చిందో తెలపడం లేదన్నారు. మండలంలోని ఆయా గ్రామాలు, ఇతర మండలాల్లో విగ్రహాల వస్తువులు అపహరణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఐ సూచించారు.