విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి | - | Sakshi

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి

Apr 3 2025 1:32 AM | Updated on Apr 3 2025 1:47 PM

గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని వీరాపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటోనిపల్లికి చెందిన నవీన్‌(35) సెంట్రింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం వీరాపురంలో ఓ ప్రైవేటు భవన నిర్మాణానికి కొంత మంది కార్మికులతో కలసి సెంట్రింగ్‌ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా ఐరన్‌ రేకులు విద్యుత్‌ వైర్లపై పడ్డాయి. అక్కడే పనులు చేస్తున్న నవీన్‌కు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు విద్యుత్‌ సరఫరాను నిలిపేసి రక్షించే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండాపోయింది. మృతుడి భార్య జయశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

విద్యుత్‌ మోటార్‌ నాచును తొలగిస్తుండగా..

పాన్‌గల్‌: విద్యుత్‌ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన బుధవారం పాన్‌గల్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం రేమద్దుల గ్రామానికి చెందిన కిల్లె పర్వతాలు(47)కు ఐదు ఎకరాల పొలం ఉంది. ఆ పొలం అంచున కేఎల్‌ఐ డీ–8 కాల్వ ఉండగా.. ఆ కాల్వలో విద్యుత్‌ మోటార్‌ వేసి పొలానికి సాగునీరు పారిస్తున్నాడు. 

ఇదే క్రమంలో మంగళవారం రోజు సాయంత్రం పొలానికి వెళ్లి కరెంట్‌ లేదనుకొని కాల్వలోని విద్యుత్‌ మోటార్‌కు పట్టిన నాచు తొలగిస్తుండగా.. విద్యుదాఘాతంతో కాల్వలోనే పడిపోయాడు. పరిసరాల రైతులు గమనించి.. కాల్వలో పడిపోయిన పర్వతాలను బయటికి తీయగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బాలపీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

నీటి సంపులో పడి బాలుడు మృతి

మద్దూరు: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఏర్పాటుచేసిన నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని దమ్‌గాన్‌పూర్‌లో బుధవారం చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రి మానస్‌(4) బాలుడు ఇంటి ముందు అడుకుంటూ నీటి సంప్‌లో పడిపోయాడు. 

ఇంట్లో పనిలో ఉన్న తల్లి, నాయనమ్మ ఆలస్యంగా బాలుడు సంపులో పడిపోయిన విషయం గ్రహించి వెంటనే మద్దూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఎర్రి మహిపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అవసరాలకు డబ్బు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

అడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారులో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ ఎం.వేణు కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామానికి చెందిన గొల్ల శివ(32) కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు. అప్పుడప్పుడు తన అవసరాల కోసం తల్లితో డబ్బులు తీసుకునేవాడు. ఈక్రమంలో ఇదే విషయంలో మంగళవారం రాత్రి తల్లితో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. 

అదే రోజు రాత్రి 44వ నంబర్‌ జాతీయ రహదారి సమీపంలోని సోలార్‌ గేట్‌ వద్ద క్షణికావేశంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.వేణు తెలిపారు.

సారా స్థావరాలపై దాడి

ఊర్కొండ: మండలంలోని ఠాగూర్తండా, అమ్మపల్లితండా, మఠంతండాల్లో సారా తయారీ, అమ్మకం స్థావరాలపై బుధవారం ఎక్సైజ్‌ అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలో సుమారు 300 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేసి, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఠాగూర్‌ తండాకు చెందిన రమావత్‌ రవిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా సారా తయారు చేసినా, అమ్మినా, అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్‌ సీఐ వెంకటరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ బాలకృష్ణారెడ్డి, సిబ్బంది యాదగిరి, రఘు, నార్య, మాధవి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement