హమ్మయ్య..రైలొచ్చిందోచ్
● భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ పునఃప్రారంభం ● నేటి నుంచి యథావిధిగా రాకపోకలు
బెల్లంపల్లి: సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/74) రైలు ఎట్టకేలకు శుక్రవారం నుంచి పునఃప్రారంభమైంది. రైల్వే అధికారుల అనాలోచిత విధానాల వల్ల గడిచిన ఐదు రోజులు అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడానికి వీలుగా ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు ఏకంగా 30 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసి, పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లను దారి మళ్లించడంతోపాటు మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. అయితే ఆ పనులతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయిన గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలుతో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు, ప్రయాణికులు వ్యతిరేకించారు. ‘ఎక్స్ ’వేదికగా పోస్టులు పెట్టి హోరెత్తించారు. దీంతో ద. మ. రైల్వే అధికారులు ఓ మెట్టు దిగివచ్చి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు కొంత సడలింపు ఇచ్చారు. ఈనెల 14వ తేదీ వరకు యధాతథంగా నడిపించి 15 నుంచి నిలిపివేశారు. అంతకుముందు ప్రకటించినట్లుగానే ఈనెల 16 నుంచి 20 తేదీ వరకు రైలు రాకపోకలను స్తంభింపజేశారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తికావడంతో తిరిగి ఈనెల 21 నుంచి రైలు పునఃరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment