
మలేరియా నిర్మూలనకు కృషి
మంచిర్యాలటౌన్: జిల్లాలో మలేరియా వ్యాధి రాకుండా అరికట్టి, మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో దోమలు పెరగకుండా చూడాలని, 2030 నాటికి దేశవ్యాప్తంగా మలేరియా నిర్మూలనలో జిల్లాను భాగస్వామిగా చేయాలని అన్నారు. నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెందుతాయని, నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎస్.అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు శివప్రతాప్, అశోక్, సునిత, అమర్, రాము, రజిత, మలేరియా టెక్నికల్ సూపర్‌వైజర్ సంతోష్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు.