
మన హైదరాబాద్ నుంచి వెళ్లి బాలీవుడ్‌లో అజిత్‌గా మారిన హమీద్ ఖాన్ తన విలనీలో భాగంగా ఎప్పుడూ పక్కన ఒక గర్ల్ ఫ్రెండ్‌ను పెట్టుకుని ఉంటాడు. ‘జంజీర్’లో అతడు ఆ గర్ల్ ఫ్రెండ్‌ను చాలా ప్రేమగా ‘మోనా డార్లింగ్’ అని పిలుస్తూ ఉంటాడు. ఆ పాత్రను వేసింది బిందు. ఆమె ఆ పాత్ర ఎంత హిట్ అంటే నేటికీ మోనా డార్లింగ్ స్పూఫ్‌లు వస్తూనే ఉంటాయి. హెలెన్, అరుణా ఇరానీ తర్వాత హిందీలో క్లబ్ డాన్సర్‌గా బిందు చాలా పాపులర్ అయ్యింది. విశేషం ఏమిటంటే పెళ్లయ్యాక ఆమె నటి అయ్యింది. పెళ్లయ్యాకే క్లబ్ డాన్సులు చేసి ఒక ప్రొఫెషనల్ నటి పాత్రను బట్టి పని చేయాలి అని సమాజాన్ని ఒప్పించింది. 1951లో గుజరాతీ దంపతులకు జన్మించిన బిందు తండ్రి మరణం తర్వాత కుటుంబం కోసం సినిమాలలో ప్రవేశించింది.
అయితే ఒకటి రెండు సినిమాల తర్వాత చంపక్ జాదరీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విరమించుకుంది. కాని ఆమె చెల్లెలు జయ వివాహం ప్రఖ్యాత సంగీత దర్శకత్వ ద్వయం లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లోని లక్ష్మీకాంత్‌తో జరిగింది. ఒకసారి మరిది గారి రికార్డింగ్ చూడటానికి బిందు రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లి అక్కడే ఉన్న ప్రముఖ దర్శకుడు శక్తి సామంత చూసి తాను తీయబోతున్న ‘కటీ పతంగ్‘లో వేషం వేయమని అడిగాడు. భర్త ఇందుకు ముందు శషభిషలు పడినా తర్వాత అంగీకరించాడు. ఆ సినిమాలో బిందు చేసిన క్లబ్ సాంగ్ ‘మేరా నామ్ షబ్బో’ సూపర్‌హిట్ అయ్యాక ఇక బిందు బాలీవుడ్ తాజా వాంప్ యాక్ట్రెస్‌గా అవతరించింది. బిందు చేసిన అనేక క్లబ్ సాంగ్స్ హిట్ అయ్యాయి. ‘అజ్‌నబీ’లో ‘హంగామా హోగయా’, ‘ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే’లోని ‘ఆకె దర్ద్ జవా హై’.. వాటిలో కొన్ని. ఆమె ఎత్తు ఎక్కువ. అందుకని హీరోలు ఆమెను హీరోయిన్‌గా బుక్ చేయడానికి పెద్ద ఇష్టపడేవారు. అందువల్ల బిందు అతి కొద్ది సినిమాలలోనే హీరోయిన్‌గా కనిపించింది.
బిందు ఎన్ని పాటలు చేసినా ‘జంజీర్’లో వేసిన మోనా డార్లింగ్ పాత్రతో మరింత గుర్తుండిపోయింది. అందులో విలన్ అజిత్ చాలా కూల్‌గా తన దుర్మార్గాలన్నింటిని ఈ మోనా డార్లింగ్‌తో పంచుకుంటూ ఉంటాడు. ‘జంజీర్’ హిందీలో రామ్‌చరణ్‌తో రీమేక్ అయ్యింది. అజిత్‌గా ప్రకాష్ రాజ్ వేసినా మోనా డార్లింగ్‌గా ఎవరో వేశారు అన్నట్టుగా ఆ క్యారెక్టర్‌ను జనం పట్టించుకోలేదు. ‘శంకరాభరణం’లో కె.విశ్వనాథ్ మంజు భార్గవికి మంచి వేషం ఇచ్చారు. అది అప్పట్లో పెద్ద వార్త.
ఎందుకంటే మంజు భార్గవి వ్యాంప్ వేషాలతో పరిశ్రమలో గుర్తింపు పొందింది. కాని దీనికి చాలా కాలం ముందే హృషికేశ్ ముఖర్జీ ‘అభిమాన్’లో బిందుకు మంచి వేషం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్లబ్ డాన్సర్ బిందుకు అంత మంచి వేషమా అని అందరూ చెవులు కొరుక్కుంటే ఆ సినిమాలో బిందు అమితాబ్ ఆత్మీయురాలిగా మంచి మార్కులు కొట్టేసింది. బిందు మధ్యలో గ్యాప్ తీసుకున్నా ఆ తర్వాత హమ్ ఆప్ కే హై కౌన్ వంటి కొన్ని సినిమాలలో సరదాగా నవ్వించే పాత్రలు పోషించింది. బిందు ఒక కాలపు చెదరని తళుకు సినిమా ప్రేక్షకుల జ్ఞాపకాలలో.
Comments
Please login to add a commentAdd a comment