భారత అత్యున్నత పురస్కారాలను ఎన్నో అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరారు. ఈ శుభవార్తతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో తిరుగులేని రికార్డ్స్ కొల్లగొట్టిన చిరు ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటు డాక్టరేట్‌ను కూడా ఆయన అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గురించి తెలియని వారుండరు. చాలామంది ఈ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొందరికి నిరాశే మిగులుతుంది. అయితే, టాలీవుడ్ మెగాస్టార్‌కు ఆ గౌరవం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు అందరూ దటీజ్ చిరంజీవి అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.
గిన్నిస్ రికార్డ్స్‌లో చిరుకు చోటు.. కారణమిదే
చిరంజీవి సుమారు 46 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా తిరుగులేని జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. చిరు తనదైన స్టైల్లో డ్యాన్స్‌లు, నటనతో ఎప్పటికప్పుడూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో రికార్డ్ నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా చిరు మాత్రమే ఉన్నారు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‍లో ఈమేరకు ఓ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిథులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డ్ అందుకున్నారు.
ఈ గౌరవం కోసం నేను ఎదురుచూడలేదు: చిరంజీవి
ఈ గౌరవం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే, ఈ గౌరవం కోసం నేను ఎప్పుడూ ఎదురుచూడలేదు. నాకు నటన మీదకన్నా డాన్స్ మీదే మక్కువ ఎక్కువ. ఆ ఇష్టమే ఈ గిన్నీస్ అవార్డు రావడానికి కారణం అనుకుంటా. చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్‌లు చేయడం అనేది నాకు అదనపు అర్హతను తెచ్చిపెట్టింది. కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్‌లకు చాలా ప్రత్యేకత వచ్చింది. నటనకు అవార్డ్స్ వస్తాయని తెలుసు. కానీ, ఈ రకంగా నా డ్యాన్స్‌లకు కూడా అవార్డ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంలో నా దర్శకనిర్మాతలు, అభిమానుల పాత్ర ఎన్నటికీ మరువలేనిది.' అని చిరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment