
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్‌బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ– ‘‘రాయన్’ మూవీ తర్వాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడై’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్‌కి ఇది నటుడిగా యాభై రెండో చిత్రం, అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా.
ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించిన ‘విడుదల 2’ చిత్రాన్ని ఇటీవల మా బ్యానర్‌లో తెలుగులో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది’’ అని తెలిపారు.