సినిమాకు హద్దులు చెరిగి చాలా కాలమే అయ్యింది. భాషాభేదం చూడకుండా టాలెంట్ ఉంటే భారతీయ సినిమాలోనే కాదు ప్రపంచ సినిమలోనూ ఎవరైనా నటించవచ్చు. ఇక ఇటీవల శాండిల్‌వుడ్ తారల విస్తరణ బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. పలువురు కన్నడ బ్యూటీలు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి స్టార్స్‌గా వెలిగిపోతున్నారు. కాగా ఇప్పుడు నటి ప్రియాంక మోహన్ కూడా దక్షిణాది స్టార్‌గా ముద్ర వేసుకుంటున్నారు. ఈ కన్నడ భామ 2019 కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు.
మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ నటిస్తూ ఐదేళ్లలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాందించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో నాని గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చి సరిపోదా శనివారం చిత్రంతో హిట్ అందుకున్నారు. ఇక తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. అలాగే డాన్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రెండో సారి జత కట్టి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించిన ప్రశంసలు అందుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ దర్శకత్వం వహించిన నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిశారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
కాగా ఇటీవల నటుడు జయంరవితో జత కట్టిన బ్రదర్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ప్రియాంక మోహన్‌కు అవకాశాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీకి నటుడు దుల్కర్‌సల్మాన్ చాన్స్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఇటీవల లక్కీ భాస్కర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈయన మాతృభాషలో కథానాయకుడిగా నటిస్తూ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి ఆర్‌డీఎక్స్ చిత్రం ఫేమ్ నకాశ్ హిదాయత్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.
ఇందులో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటి ప్రియాంక మోహన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే కోలీవుడ్ వెర్సస్‌టైల్ యాక్టర్ ఎస్‌జే.సూర్య కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించనున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇందులో నటి ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తే ఇదే ఈమె తొలి మలయాళ చిత్రం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment