సాక్షి, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరగనున్నాయి. సినీ విమర్శకుడిగా ఫేమస్ అయిన మహేశ్ నేపథ్యం ఒక్కసారి చూస్తే..
కత్తిమహేశ్ కుమార్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన తండ్రి వ్యవసాయశాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మహేశ్‌కు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.
డైరెక్టర్ అవ్వాలనుకొని..
ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు పనిచేశారు. వర ముళ్లపూడి వద్ద 10 ఎపిసోడ్‌లకు సహాయకుడిగా పని చేసిన తర్వాత డబ్బులు సరిపోకపోవడంతో చిత్తూరు వెళ్లిపోయి ఓ ఎన్జీవోలో చేరారు. ఆ తర్వాత యూనిసెఫ్, వరల్డ్ బ్యాంకు, సేవ్ ది చిల్ర్డన్ తదితర సంస్థల్లో పనిచేశారు.
బెంగాలీ యువతితో ప్రేమలో..
కత్తి మహేశ్‌ది ప్రేమ వివాహం. యూనిసెఫ్‌లో పనిచేస్తున్నప్పుడు బెంగాలీ యువతి సోనాలి పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఆమె కేర్ ఇండియా సంస్థ తరపున పనిచేసేది. వీరికి ఒక్క కుమారుడు ఉన్నారు.
మరో ప్రయత్నం
అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలకు స్ఫూర్తి పొంది సినిమా చేయాలని మళ్లీ ఇండస్ట్రీవైపు అడుగులు వేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించాడు. పెసరట్టు అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
అనుకోకుండా ‘బిగ్‌బాస్’లోకి
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కత్తి మహేశ్ పాల్గొన్నారు. అయితే ఆ అవకాశం కూడా అనుకోకుండానే వచ్చిందని పలు సందర్భాల్లో మహేశ్ చెప్పారు. స్టార్ మా నుంచి కాల్ రాగానే ఏదైనా సినిమా కోసం ఏమో అనుకున్నారట. కానీ, బిగ్‌బాస్ కోసం అని చెప్పడంతో ఆశ్చర్యపోయారట. అలా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆయన దాదాపు నాలుగు వారాల పాటు ప్రేక్షకులను అలరించారు.
అలాంటి సినిమా తీయాలకున్నాడు
సినిమాలు అంటే ఇష్టం కాని, నటుడు కావాలని కత్తి మహేశ్ ఎప్పుడు అనుకోలేదట. దర్శకుడిగా మారి మంచి చిత్రాలను తెరకెక్కించాలనుకున్నారట. అయితే సంపూర్ణేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘హృదయ కాలేయం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేశ్. ఆ సినిమా దర్శకుడు సాయిరాజేశ్ కోరిక మేరకు నటుడిగా మారాడట. ‘నిజానికి నటుడు అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సాయి రాజేశ్ నాకు స్నేహితుడు. చిన్న బడ్జెట్‌లో ‘హృదయ కాలేయం’ తీస్తున్నానని నాతో చెప్పాడు. పెద్ద నటులతో చేసేంత బడ్జెట్ లేదని, మీకు సరిపోయే పాత్ర ఒకటి ఉంది చేస్తారా? ‘మీరు మీలా ఉంటే చాలు’ అని అడిగారు. నేను, రచయిత దర్శకుడు కావడంతో సంభాషణలు, హావభావాలు పలకడం సులభమైంది. అంతేకానీ, నేను గొప్ప నటుడిని కాదు’అని కత్తి మహేశ్ ఓ సందర్భంలో చెప్పారు.
నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు. ఎప్పటికైనా మంచి సందేశాత్మక చిత్రం తీయాలని కత్తి మహేశ్ అనుకునేవారని, ఆయన కోరిక అదేనని ఆయన సన్నిహితులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment