టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి గుండె వద్ద నొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. అర్దరాత్రి సుమారు 1గంటకు ఆమె మరణించారు. గుండెపోటు వల్లే గాయత్రి మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
కూతురిలో అమ్మను చూసుకున్న: రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురు గాయత్రి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన తన కూతురు గురించి చెబుతూ ఇలా ఎమోషనల్ అయ్యారు. అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడని ఒక సినిమా వేదిక మీద పంచుకున్నారు. 'నా పదేళ్ల వయసులో మా అమ్మ గారు చనిపోయారు. ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే, నాకు కూతురు (గాయత్రి ) పుట్టిన తర్వాత మా అమ్మను తనలోనే చూసుకుంటున్నా. కానీ, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తనతో మాటలు లేవు.
అయినప్పటికీ.. బేవార్స్ అనే సినిమాలోని 'తల్లీ.. తల్లీ.. నా చిట్టి తల్లి' అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. ఈ పాటను ఆమెకు నాలుగుసార్లు వినిపించాను.' అని ఆయన అన్నారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్న కొద్దిరోజుల తర్వాత తన కూతురిని రాజేంద్రప్రసాద్ స్వాగతించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment