
టాలీవుడ్‌లో మళ్లీ చిన్న సినిమాల సందడి మొదలైంది. దేవర మినహా ఈ నెలలో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. దీంతో ప్రతివారం మూడు నాలుగు చిన్న సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ వారం విడుదలైన చిన్న సినిమాల్లో స్పీడ్ 220 ఒకటి. కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు హర్ష బీజగం దర్శకత్వం వహించారు. ఓ వైవిధ్యమైన కథ... కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సూర్య(హేమంత్), చందు(గణేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఊర్లో భిక్షపతి(తాటికొండ మహేంద్రనాథ్) అనే ఓ జమీదారు ఇంట్లో పనిచేస్తూ... ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆయన కూతురు మాయ(భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్)తో వీరిద్దరికి చిన్నప్పటి నుంచే స్నేహం ఉంటుంది. పెద్దయ్యాక మాయ..సూర్య,చందులతో ఒకరికి తెలియకుండా మరొకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది.సూర్యకి బాగా క్లోజ్‌గా ఉన్న ఓ కుర్రాడు అనుమాదస్పదస్థితిలో చనిపోతాడు. అలాగే మాయ కూడా చనిపోతుంది.తనకు క్లోజ్‌గా ఉన్న ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో సూర్య పిచ్చివాడు అయిపోతాడు. అందరిని వదిలేసి ఒంటరిగా తిరుగుతుంటాడు. అయితే ఓ సారి అతనిపై హత్యాయత్నం జరుగుతుంది. సూర్యను చంపాలని ప్రయత్నించేదెవరు? మాయ, చింటూ చనిపోవడానికి గల కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
స్వచ్ఛమైన ప్రేమ కోసం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన ఓ ఇద్దరు యువకులు, ఓ యువతిల మధ్య జరిగే ట్రయాంగిల్ కథ ఇది. దానిని తెరమీద బోల్డ్‌గా చూపిస్తూ.. ‘రా’ రొమాన్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే పకడ్బంధీగా ఉండాలి. తెలిసి కథే అయినా..దానిని తెరపై ఎంత ఆసక్తికరంగా చూపించారనేదానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కొంతమేర విజయం సాధించాడు. బోల్డ్ సీన్లతో కథనాన్ని నడిపిస్తూ యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
అయితే సినిమా చూస్తున్నప్పడు మనకు ఆర్ ఎక్స్ 100 సినిమాలోని చాలా సీన్లు గుర్తొస్తాయి. అలాగే కొన్ని సీన్లు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి సూర్య, చందుతో కలిసి పెరిగిన మాయ.. పెద్దయిన తరువాత ఎందుకు అలా ఆధునిక భావాలతో సెంటిమెంట్ కు తావులేకుండా పెరగాల్సివచ్చిందో అదే దానికి క్లారిటీ ఇవ్వలేదు. నా కూతురు కామంతో మీ ఇద్దరితో ఇలా ఆడుకుందని తండ్రితో చెప్పించడం కూడా నప్పలేదు. అలా కాకుండా ఆమె అలా పెరగడానికి ఓ బలమైన కారణం ఉండేలా చూపిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో అంతా... లవ్, రొమాన్స్ ను చూపించిన దర్శకుడు... సెకెండాఫ్ లో మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. సినిమా నిడివి తక్కువ ఉండడం సినిమాకు కలిసొచ్చింది.
ఇందులో మాయ పాత్రలో చేసిన భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్ గురించి. ఆమె నటన సినిమాకి హైలైట్. బోల్డ్ సీన్స్ లో అందంగా కనిపించింది. ఉత్తరాది అమ్మాయే అయినా... తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. మల్లిడి హేమంత్ రెడ్డి సూర్య పాత్రలో రఫ్ గా కనిపించి ఆకట్టుకుంటారు. భగ్న ప్రేమికుడిగా మంచి నటనే కనబరిచారు. అలాగే గణేష్ కూడా చందు పాత్రలో మెప్పించారు. సుప్రియ పాత్రలో చేసిన శర్మ జాహ్నవి పల్లెటూరి అమ్మాయి పాత్రలో లంగా వోణిలో ఆకట్టుకుంటుంది. జమిందారుడు భిక్షపతిగా, హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన తాటికొండ మహేంద్రనాథ్ నటన కూడా పర్వాలేదు. చింటూ పాత్రలో కనిపించిన చిన్నకుర్రాడు కూడా తన పాత్రకు న్యాయం చేశారు.నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు.నిర్మాత విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment