
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జే బేబీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఈ సినిమా చూసేముందు ఎవరికి వారు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. అదేమంటే మనకిష్టమైన వారిపై మనకెంతకాలం ఇష్టం ఉంటుంది? అలాగే, మనకు ఇష్టం లేని వారిపై కష్టం ఎంతవరకు ఉంటుంది... ఈ రెండు ప్రశ్నలు కాస్త విచిత్రమైనవే. కానీ వాటికి మనం ఇచ్చే సమాధానాన్ని బట్టే ఉంటుంది మనతో ఉన్న వారి జీవితం. మనకు తోడుగా ఇష్టంగా ఉండేవారు ఎందరో ఉంటారు. అలాగే వారంటే మనకెంత ఇష్టమో వారికి తెలియజేయాలి.
ఈ జీవితం మీ తల్లి మీకు ప్రసాదించింది. ఆ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేది మీ తండ్రి. మరి ఆ తల్లిదండ్రుల వయస్సు పైబడిన తర్వాత వారికి అండగా ఉండాల్సింది మీరే. అలాంటి అండ కోరుకున్న ఓ అమ్మ కథే జే బేబి. కథ లైను వినడానికి సింపుల్‌గా ఉన్నా సినిమా చూసినంతసేపు వయస్సు పైబడ్డ మన తల్లిదండ్రులకు మన అవసరం ఏపాటిదో మనకు అర్థమవుతుంది. ఇది అల్లుకున్న కథ కాదు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది.
కథలోని పాత్రలు, కథా పాత్రల్లా కాక మన కళ్ల ముందే కదలాడుతున్న అనుభూతిని కలిగిస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా తల్లిదండ్రులున్న ప్రతి కొడుకు, కూతుళ్లు చూడవలసిన సినిమా. అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓ సారి కథ చెప్పుకుందామా మరి.
జే బేబి ఓ తమిళ సినిమా. దీనికి సురేష్ మారి దర్శకుడు. జే బేబికి ముగ్గురు సంతానం. శంకర్, సెంథిల్, కవిత. జే బేబి తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబాన్ని అతికష్టం మీద పైకి తీసుకువస్తుంది. కానీ జే బేబీ మానసికస్థితి కొంత దెబ్బతింటుంది. చికిత్సకోసం పిల్లలు ఆసుపత్రిలో చేర్పిస్తే అక్కడి నుంచి తప్పించుకుని తెలియకుండా చెన్నైనగరం నుండి కోల్‌కతా చేరుకుంటుంది. జే బేబీని వెతికే క్రమంలో శంకర్,సెంథిల్ బయలుదేరతారు. తల్లిని వెదికే క్రమంలో ఒకే ప్రయాణాన్ని ప్రారంభించిన ఇద్దరు కొడుకులు ఓ వివాదం వల్ల మాట్లాడుకోని స్థితిలో ఉంటారు.
మాట్లాడుకోని వీళ్లు, మానసిక పరిపక్వత లోపించిన తమ తల్లిని తమకు భాష రాని నగరానికి వెళ్లి ఎలా వెదుకుతారు?, అసలు వాళ్లకి మళ్లీ జే బేబీ దొరుకుతుందా?. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న జే బేబి చూడాల్సిందే.
సినిమాలోని ప్రధానపాత్రలో నటించిన ప్రముఖ నటి ఊర్వశి జే బేబి పాత్రను పోషించలేదు, జీవించింది. సినిమా ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ అప్పుడప్పుడూ చక్కటి హాస్యాన్ని జోడించి స్క్రీన్ ప్లే అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా, రివ్యూ మమతానురాగాలకోసం వయస్సు పైబడిన పసి మనస్సులకు అక్షరాంకితం.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment