
'బలగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయిన 'మొగిలయ్య' అనారోగ్యంతో మరణించారు. బలగం సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను కదిలించారు. దీంతో ఆయన్ను అందరూ బలగం మెగిలయ్యగా చెరగని ముద్ర వేశారు. తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు మొగిలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీకి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు.
తన గాత్రంతో కళకు ప్రాణం పోసి, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన గాయకుడు మొగిలయ్య. అలా బలగం సినిమాలో చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుంటూ మొగిలయ్య, కొమురమ్మ కలిసి పాడిన 'తోడుగా మా తోడుండి.. నీడలా మాతో నడిచి' అనే సాంగ్ ఆ చిత్రానికే ప్రధానంగా నిలిచింది. ఈ పాట సమయంలో ప్రక్షకులు కూడా చాలా భావోద్వేగానికి గురికావడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కనిపించాయి. అయితే, ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మరణించడంతో చాలామందిని కలిచివేస్తుంది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథలనే తమ జీవనాధారంగా మార్చుకున్నారు. కరీంనగర్, గోదావరిఖని,సిరిసిల్ల తదితర జిల్లాలలో బుర్రకథలు చెబుతూ వచ్చిన కొద్ది ఆదాయంతోనే బతుకు పోరాటం సాగించారు. ఆయనకు ఒక కుమారుడు సుదర్శన్ ఉన్నారు. అతను స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. మొగిలయ్య టాలెంట్‌ను గుర్తించిన 'బలగం' చిత్ర దర్శకుడు వేణు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా ఆయనకు ‘భీమ్లా నాయక్’లో కూడా ఒక జానపదం గీతం పాడే అవకాశం వచ్చింది.

కొంత కాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మొగిలయ్య వరంగలోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మరణించారు. గతంలో ఆయనకు మెరుగైన వ్యైద్య సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం అందించింది. చిరంజీవితో పాటు నిర్మాత దిల్ రాజు,డైరెక్టర్ వేణు యెల్దండి వంటి వారు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆర్థిక సాయం అందించారు. కానీ, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా నిర్మాత దిల్ రాజు, వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు.