దళపతి విజయ్ రాజకీయ జోరు పెంచనున్నారు. తొలి సభను నిర్వహించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అభిమానులకు ప్రకటన వెలువడింది. నోటి మాటలతో కాదని, చేతల్లో చూపించడం మన భాష అని పార్టీ కేడర్‌కు తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పిలుపునిచ్చారు. పార్టీ అజెండా ఏంటో ప్రజలకు చెప్పేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. తమిళగ వెట్రి కళగం మహానాడు ఈనెల 27వ తేదీన విల్లుపురం జిల్లా విక్రవాండిలో జరగనున్న విషయం తెలిసిందే. ఇక్కడి వీ సాలై ప్రాంతంలో శరవేగంగా మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు, కేడర్‌ను విజయ్ పలకరించేందుకు వీలుగా 800 మీటర్ల మేరకు ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.
సెయింట్ జార్జ్ కోటను తలపించే విధంగా మహానాడు వేదిక రూపుకల్పన జరుగుతోంది. ఈ మహానాడును విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. అలాగే మహానాడు కోసం ఏర్పాటైన కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు భారీ జన సమీకరణ దిశగా పరుగు తీస్తున్నారు. ఈ పరిస్థితులలో విజయ్ అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. ఈ సభ కోసం వృద్ధులు, గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, పిల్లలు, బాల బాలికలను మహానాడుకు తీసుకు రావద్దు అని సూచిస్తూ కేడర్‌కు లేఖ రాశారు. అయితే, అలాంటి వారందరి కోసం ఇంటి వద్ద నుంచే మహానాడును వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment