
దేనికై నా టైమ్ రావాలంటారు. అలా వచ్చిన టైమ్‌ను సద్వినియోగం చేసుకోవడం కూడా తెలియాలి. ఈ విషయంలో చాలా నేర్పరి నటి త్రిష. జోడీ అనే చిత్రంలో చిన్న పాత్రతో నటిగా కెరీర్‌ను ప్రారంభించిన బ్యూటీ త్రిష. ఆరంభం ఒక్క అడుగుతోనే అన్న చందాన కథానాయకిగా ఈమె ఎదుగుదల అనూహ్యంగా మారింది. తమిళంలో సామి, గిల్లీ వంటి చిత్రాలు విజయాలు త్రిషను స్టార్ హీరోయిన్‌ను చేశాయి. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాల సక్సెస్‌లు తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఆ తరువాత హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో నటించి ఇండియన్ నటిగా తనను ఆవిష్కరించకున్నారు.
దీంతో త్రిషను లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు పలుకరించాయి. అయితే అవి ఈ భామకు విజయాలను అందించలేదు. కానీ తను రూట్ మార్చి టాప్ హీరోలతో ఛాన్స్‌లు కొట్టేసింది. ఈలోపు నటిగా 20 ఏళ్లు పైపడ్డాయి. ఇక త్రిష పని అయిపోయిందనే ప్రచారం మొదలైంది. సరిగ్గా అలాంటి సమయంలో దర్శకుడు మణిరత్నం త్రిష నెత్తిన పాలు పోశారు. ఈయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్‌లో కుందవై అనే యువరాణి పాత్రకు త్రిష ప్రాణం పోశారు. ఆమె అందం, రాజసం ఉట్టిపడేలా నటన ప్రేక్షకులను కట్టి పడేశాయి. చిత్రం రెండు భాగాలు విజయం సాధించాయి. అంతే త్రిషకు అవకాశాలు మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ తరువాత విజయ్ సరసన నటించిన లియో హిట్ అనిపించుకుంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడామురయర్చి చిత్రంలో నటిస్తున్నారు.
తర్వాత మరోసారి మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ చిత్రంలో జతకట్టనున్నారు. వీటితో పాటు కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌తో ఒక చిత్రం, మలయాళంలో టోవినో థామస్ సరసన ఐడెంటిటీ అనే చిత్రంలోనూ అక్కడ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు జంటగా మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవితో విశ్వంభరలో నటిస్తున్నారు. ఇలా నాలుగు పదుల వయసులో కూడా తరగని అందంతో రెట్టింపు ఉత్సాహంతో కాలుకు బలపం కట్టుకున్నట్లు పరుగులు తీస్తున్నారనే చెప్పాలి. వీటితో పాటు అరవింద్‌స్వామి సరసన నటించిన చదురంగ వేట్టై–2, గర్జన వంటి అనివార్య కారణాల వలన విడుదలకు నోచుకోని చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. అలా త్రిష నటించిన ఏడు చిత్రాలు ఈ ఏడాది వరుసగా విడుదల కానున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment