
పగుళ్లు.. ‘మామూలే’నట!
కల్వకుర్తి టౌన్: సాధారణంగా మానవునికి వడదెబ్బ సోకుతుంది. కానీ, విచిత్రంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో చల్లని శీతాకాలంలో వేసిన రోడ్లకు వడదెబ్బ తగిలిందా అన్న అనుమానం కలుగుతుంది. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. కానీ, ఇదే అర్థం వచ్చేలా మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగంతోపాటు.. క్వాలిటీ సెల్ చూసే జిల్లా స్థాయి అధికారి ఇలా చెప్పడం గమనార్హం. ప్రజల నుంచి పన్నుల రూపంలో రూ.కోట్లు వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులకు ఉన్న శ్రద్ధ.. నాణ్యత విషయంలో ఎందుకు లేకుండా పోతోందని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత విషయంలో అధికారులకు ముడుపులు ముట్టజెబుతున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పాలకవర్గం ముగుస్తుండటంతో..
కల్వకుర్తి మున్సిపాలిటీలో గతేడాది కిందట సుమారు రూ.15 కోట్లతో 22 వార్డుల్లో టీయూఎఫ్‌ఐడీసీ, మిషన్ భగీరథ కింద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా రోడ్లకు సంబంధించి కనీసం పదేళ్లు లైఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ విషయం అటుంచితే.. కనీసం ఏడాదిపాటు వ్యాలిడిటీ లేకుండా పగుళ్లతోపాటు, పలుచోట్ల ఏకంగా గుంతలు కూడా ఏర్పడ్డాయి. ఇటీవల మున్సిపల్ పాలకవర్గం ముగుస్తుందన్న తొందరలో ఆయా వార్డుల్లో పలుచోట్ల టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.10 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు.
అధికారే.. కాంట్రాక్టర్?
మున్సిపాలిటీలోని రోడ్లకు సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని భావించి.. ఆదరాబాదరాగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి ఏకంగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. కాంట్రాక్టర్‌గా తన పేరు ఉంటే ఇబ్బంది అవుతుందని, బంధువు పేరిట కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ చేసి టెండర్లు వేయించారు. బంధువుకు కల్వకుర్తిలో ఏకంగా ఒక ఇల్లు అద్దెకు ఇప్పించి, ఎలాంటి అనుమానం రాకుండా తనే సొంతంగా పనులు చేపట్టాడు. ఇలా సీసీ రోడ్లు మాత్రమే కాకుండా, మున్సిపాలిటీలో చాలా పనులను దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో సదరు అధికారి బదిలీ కావడంతో సీసీ రోడ్ల నాణ్యతా లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాజకీయ నాయకుల ముసుగులో మరికొందరు కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకొని, వారి బినామీ పేర్లపైన కాంట్రాక్టులు చేపట్టిన వారికి కూడా ఆ అధికారి అండదండలు బలంగానే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.
కాంట్రాక్టర్లకే వత్తాసు..
మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణంలో వరుసగా నాణ్యతా లోపాలు బయటపడుతున్నా.. మున్సిపల్ అధికారులు వాటిని తేలికగా తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ క్యూసీ (క్వాలిటీ కంట్రోల్) కేవలం జనరల్ ఫండ్, ఇతరత్రా వాటికే పనిచేస్తుండటంతో.. టీయూఎఫ్‌ఐడీసీ కింద నిర్మాణం చేపట్టే రోడ్లకు మాత్రం పబ్లిక్ హెల్త్ క్వాలిటీ సెల్ అధికారులు నాణ్యత పరిశీలిస్తారు. అయితే ఈ అధికారులు పగుళ్లు ఏర్పడటం కామన్ అని తీరిగ్గా చెప్పుకొస్తున్నారు. అధికారులే కాంట్రాక్టర్లకు వత్తాసు పలకటం, నాణ్యతపై రాజీ కుదిరేలా వారి వ్యవహార శైలి ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. క్వాలిటీ సెల్ కాకుండా సీసీ రోడ్ల నాణ్యతపై విజిలెన్స్ విచారణ చేస్తే మరిన్ని నాణ్యతా లోపాలు బయటకు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
కల్వకుర్తి మున్సిపాలిటీలో
నెలకిందట వేసిన సీసీరోడ్లకు నెర్రెలు
కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నాణ్యతా లోపాలు
సాధారణమేనని చెబుతున్న ప్రభుత్వ క్వాలిటీ సెల్
అధికారుల తీరుతో ప్రజాధనం
దుర్వినియోగం
కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్‌కాలనీలో గత నెలలో సుమారు 400 మీటర్ల మేర నిర్మించిన సీసీ రోడ్డు ఇది. అయితే రోడ్డు వేసిన 15 రోజులకే పూర్తిగా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక ఈ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ అధికారులు శాంపిళ్లు సేకరించారే తప్ప, పగుళ్ల గురించి పట్టించుకోలేదు. పైగా పగుళ్లు సాధారణమే అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. రూ.15 లక్షలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్డుకు అప్పుడే పగుళ్లు రావడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
క్యూసీని తీస్తున్నాం..
మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాక క్యూసీని తీస్తున్నాం. రోడ్ల పగుళ్లకు ఎండల తీవ్రత ఒక కారణం కావొచ్చు. గతేడాది కిందట వేసిన రోడ్లు పగుళ్లతోపాటు, రోడ్లు దెబ్బతిన్న విషయమై మరోమారు క్యూసీ నిర్వహిస్తాం. నాణ్యతలో లోపాలు ఉన్నట్లుగా గుర్తిస్తే వాటిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తాం.
– భరత్‌కుమార్, పబ్లిక్ హెల్త్ క్యూసీ అధికారి

పగుళ్లు.. ‘మామూలే’నట!
Comments
Please login to add a commentAdd a comment