ముక్కిడిగుండం గ్రామానికి రెండు దిక్కులా మొలచింతలపల్లి వైపు ఉడుముల వాగు, నార్లాపూర్ వైపు పెద్దవాగు ప్రవహిస్తుంటాయి. వర్షాకాలంలో ఈ రెండు వాగులు రోజుల తరబడి పొంగిపొర్లుతాయి. ఆ సమయంలో ముక్కిడిగుండంతోపాటు అనుబంధ గ్రామమైన గేమ్యానాయక్‌తండాకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పీఆర్ శాఖ ఎస్‌డీఎఫ్ నిధులు రూ.9 కోట్లు మంజూరు చేయగా.. లాంఛనంగా పనులను శంకుస్థాపన చేశారు. కానీ, పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఏప్రిల్ నెల నుంచి పనులు చేపట్టగా ప్రస్తుతం తుది దశకు చేరుకొని అందుబాటులోకి రానుంది. అయితే నార్లాపూర్ నుంచి ముక్కిడిగుండం వెళ్లే దారిలో పెద్దవాగు కంటే ముందు దాని పక్కనే మాల ఓడిక (చిన్న వాగు) పారుతుంది. రెండు వాగుల మధ్య వంద మీటర్ల లోపు దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న బ్రిడ్జి పక్కనే ఉన్న ఈ వాగు కూడా ఉన్నా.. దీనిని అనుసరించి బిడ్జి నిర్మించాలనే ఆలోచన అధికారులకు తట్టలేదు. వర్షాకాలంలో ఈ వాగు సైతం ఉధృతంగానే పారుతుంది. దీంతో పెద్దవాగుపై బ్రిడ్జి ప్రారంభమైనా వర్షాకాలంలో మాల ఓడిక దాటి వెళ్లడం కష్టమేనని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment