
చిన్నవాగు దాటాలి
పెద్దవాగు చేరాలంటే..
రూ.9 కోట్లతో నార్లాపూర్– ముక్కిడిగుండం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం
కొల్లాపూర్: ఆ గ్రామాలు అసలే నల్లమల ప్రాంతంలో మూరుమూల విసిరేసినట్టుగా ఉంటాయి. ఆయా గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలు ఇప్పుడే తీర్చడం ఇష్టం లేదో.. లేక మరోసారి వంతెన నిర్మాణం చేపట్టి ఎంతో కొంత వెనకేసుకుందాం అనుకున్నారో.. కానీ, ముక్కిడిగుండం– గేమ్యానాయక్‌తండాల ప్రజల వంతెన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే ముక్కిడిగుండం– గేమ్యానాయక్‌తండాలకు రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. రెండు ప్రధాన వాగులకు మధ్యలో ఈ గ్రామాలు ఉండటంతో.. తమ కష్టాలు తీర్చాలని దశాబ్దాల కాలంగా వారు ప్రభుత్వాలను కోరారు. గత ప్రభుత్వ హయాంలో వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఒక వైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా.. మరోవైపు పనులు తుదిదశకు చేరుకున్నాయి. అయితే అధికారుల అవగాహన లోపం, నిధుల మంజూరులో వ్యత్యాసాల కారణంగా పెద్దవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి అందుబాటులోకి రాబోతున్నా.. ప్రజల రాకపోకల కష్టాలు మాత్రం తీరే పరిస్థితి కనిపించడం లేదు.
చిన్న బ్రిడ్జిపై నిర్మిస్తేనే..
పెద్దవాగు బ్రిడ్జికి అనుసంధానంగా మరో వంతెన లేదా కల్వర్టు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మాల ఓడికైపె వంతెన నిర్మాణం కోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి.. ఉన్నతాధికారులకు పంపారు. మాల ఓడికైపె బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే ముక్కిడిగుండం, గేమ్యానాయక్‌తండా ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
కొల్లాపూర్ మండలంలోని మారుమూల ప్రాంతమైన ముక్కిడిగుండం– నార్లాపూర్ మధ్యలో పారుతున్న పెద్ద వాగు ఇది.. ఈ వాగుకు అటువైపు ముక్కిడిగుండం, గేమ్యానాయక్‌తండాలు ఉండగా.. ఆయా గ్రామాల ప్రజలు, రైతుల రాకపోకల కోసం దశాబ్దాలపాటు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం రూ.9 కోట్లు వెచ్చించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించింది. ఏళ్లతరబడిగా ఆగుతూ.. సాగిన ఈ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకోగా.. అధికారులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.
తుది దశకు పనులు..
త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు
సమీపంలోనే అడ్డంకిగా
మరో చిన్నవాగు
దానిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి
రూ.2 కోట్లతో ప్రతిపాదనలు
ఇప్పట్లో ఎడతెగని వంతెన కష్టాలు
ఇక్కడ కనిపిస్తున్న చిన్న వాగు సైతం అదే గ్రామాల మధ్యలో.. పెద్ద వాగుకు సమీపంలోనే పారుతుంది. ఆ పెద్ద వాగు.. చేరాలంటే ఈ చిన్నవాగు దాటాలి.. ప్రస్తుతం ఎండాకాలంలోనే ఈ వాగు పైనున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి వచ్చే ఊట నీటితో ఇలా పారుతోంది. అదే వర్షాకాలంలో అయితే ఇంకెతలా పారుతుందో ఊహించుకోవచ్చు. ఏదైతేనేం ఈ వాగుపై కూడా వంతెన నిర్మాణానికి సంబంధిత అధికారులు మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.

చిన్నవాగు దాటాలి
Comments
Please login to add a commentAdd a comment